తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక చనిపోయిన వారిలో 28 మంది వివరాలు తమవద్ద ఉన్నాయని తెదేపా శాసనసభ పక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు ఓ లిస్టు విడుదల చేశారు. వీరే కాకుండా మరో 10 నుంచి 15 మంది మృతులు ఉండొచ్చని అంచనా వేశారు. వారి సమాచారమూ సేకరిస్తున్నామని తెలిపారు. వాస్తవం ఇలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మృతుల సంఖ్య దాచిపెడుతూ కేవలం 11 మందే చనిపోయారని చెప్పి ప్రజల్ని తప్పుదారి పట్టిస్తోందని రామానాయుడు ధ్వజమెత్తారు.
రామానాయుడు ఇంకా ఏమన్నారంటే...
- ఈ నెల 10న రుయా ఘటన జరిగింది. 11న ప్రభుత్వం విడుదలచేసిన కొవిడ్ బులిటెన్‌లో చిత్తూరు జిల్లాలో 18 మంది చనిపోయినట్లు పేర్కొంది. ఒక్క రుయా ఆసుపత్రిలోనే దాదాపు 50 మంది వరకూ చనిపోయారని ఆసుపత్రి వర్గాలు ఇచ్చిన నివేదికలో ఉంది. ఈ రెండింటిలో ఏది వాస్తవం?
- రుయాలో దుర్ఘటన జరిగిన రోజు ఉదయం ఆసుపత్రి అంతా తనిఖీ చేసినట్లు, ప్రతిదీ సక్రమంగా ఉన్నట్లు అక్కడి సూపరింటెండెంట్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఆ తర్వాత 12 గంటల వ్యవధిలోనే 50 మంది వరకూ చనిపోయారని ఆసుపత్రి నివేదిక చెబుతోంది. దీనిపై పూర్తిస్థాయి విచారణ చేయాలి.
- వారం, పది రోజులుగా ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరా అప్పుడప్పుడూ నిలిచిపోయేదని మృతుల బంధువులు, వారి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రాణవాయువు సరఫరాలో అంతరాయం తలెత్తుతున్నా అక్కడున్న సిబ్బంది ఎందుకు స్పందించలేదు? పూర్తిగా ఆక్సిజన్ సరఫరా ఆగిపోయి, ప్రాణాలు పోయేంత వరకూ ప్రభుత్వం ఏం చేసిందో సమాధానం చెప్పాలి.
- ఆక్సిజన్ సరఫరా ట్యాంకర్లకు జీపీఎస్ విధానాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదు? వాటి రాకపోకలపై పర్యవేక్షణ ఎందుకు ఉంచలేదు? గ్రీన్ ఛానెల్ ఎందుకు పెట్టలేదు? ఇలాంటి చేతకాని ప్రభుత్వాలు ఉంటాయని తెలిసే సుప్రీం కోర్టు కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. దాని ప్రకారం అంబులెన్సుల మాదిరి ఆక్సిజన్ ట్యాంకర్లు నిర్దేశిత సమయానికి వచ్చేలా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేకపోయింది.
- రుయాలో ఘటన జరిగి మూడు రోజులైనా బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు?
- అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఘటనా స్థలానికి ఎందుకు వెళ్లలేదు? రోగులకు ఎందుకు భరోసా కల్పించలేకపోయారు?
- రాష్ట్ర ప్రజలు వారి ప్రాణాలు నిలుపుకునేందుకు ఆక్సిజన్ కోసం నిస్సహాయులుగా ఎదురుచూస్తున్నారు. ప్రాణవాయువు అందక రాష్ట్రంలో ఇప్పటివరకూ 180 మంది చనిపోయారు. రుయాలో ఆక్సిజన్ అందక చనిపోయిన వారిని చూస్తే జలియన్‌వాలాబాగ్ ఉదంతం గుర్తుకొస్తోంది.