తెదేపా హయాంలో చేపట్టిన హంద్రీ- నీవా కుప్పం బ్రాంచి కాలువ తవ్వకం పెండింగ్ పనులను ప్రభుత్వం పట్టించుకోవాలన్న డిమాండుతో తెదేపా ఆధ్వర్యంలో జలసాధన పాదయాత్రను సోమవారం ఉదయం రామకుప్పం మండలంలోని వర్ధికుప్పం వద్ద ప్రారంభించి.. ఐదు రోజుల పాటు కొనసాగించాలని నేతలు నిర్ణయించారు. దీన్ని గుర్తించిన అధికార పార్టీ నాయకులు.. తెదేపా పాదయాత్రను అడ్డుకుంటామని ప్రకటించారు. శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమయ్యే పరిస్థితి రానుందని గ్రహించిన పోలీసులు రహస్య అజెండాను అమలు చేశారు.
సోమవారం ఉదయాన్నే కుప్పం, శాంతిపురం, రామకుప్పం, గుడుపల్లె మండలాల్లో పెద్ద ఎత్తున పోలీస్ అధికారులు, సిబ్బంది మోహరించారు. పలమనేరులో మాజీ మంత్రి అమరనాథరెడ్డి, చిత్తూరులో తెదేపా పార్లమెంట్ ఇంఛార్జి పులివర్తి నాని, ఎమ్మెల్సీ దొరబాబు, పుంగనూరులో నియోజకవర్గ ఇన్‌ఛార్జి అనీషారెడ్డి, శ్రీనాథరెడ్డిని గృహ నిర్బంధం చేశారు. కుప్పం నియోజకవర్గంలో ముఖ్య నేతలతో పాటు మండల స్థాయి నాయకులను గృహాలకే పరిమితం చేశారు. శాంతిపురం మండలంలో ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, తెదేపా మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జనార్దన్‌రెడ్డి, ఆర్.ఎస్.మణి, మాజీ వైస్ ఎంపీపీ ఉదయ్‌కుమార్, రెస్కో మాజీ వైస్ ఛైర్మన్ చలపతి, రామకుప్పంలో పార్టీ మండల అధ్యక్షుడు ఆంజినేయరెడ్డి, మండల ఇన్‌ఛార్జి మునస్వామి, పట్రనారాయణ, చలపతి, ఆనందరెడ్డి తదితర నేతలను హౌస్ అరెస్టు చేశారు. కుప్పంలో పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి మునిరత్నం, చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్, జడ్పీటీసీ మాజీ సభ్యుడు రాజ్‌కుమార్, ఏఎంసీ మాజీ ఛైర్మన్ సత్యేంద్రశేఖర్ తదితరులను గృహ నిర్బంధం చేశారు. నాయకులను పోలీసులు అడ్డుకోవడాన్ని తెలుసుకున్న తెదేపా శ్రేణులు పెద్ద ఎత్తున వారి ఇళ్ల వద్దకు చేరుకొని సంఘీభావం తెలిపారు.
హంద్రీ- నీవా కాలువలో తెదేపా శ్రేణుల పాదయాత్ర
రామకుప్పం మండలంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు మెరుపు పాదయాత్రను చేపట్టారు. ముఖ్య నేతలను పోలీసులు అడ్డుకోవడంతో.. పలు చోట్ల ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు జెండాలను చేతపట్టి కాలువ.. గట్టుపై పాదయాత్రను కొనసాగించారు.శాంతిపురం మండలం రాళ్లబూదుగూరు వద్ద కాలువలో తెదేపా శ్రేణులు పాదయాత్రను చేపట్టి.. చంద్రబాబుకు మద్దతుగా నినాదాలు చేశారు.
వైకాపా ర్యాలీలు