తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తలి మండలి అడ్డగోలు నిర్ణయాలతో శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీయవద్దని తెదేపా డిమాండ్ చేసింది. తితిదే నిధులను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సెక్యూరిటీ బాండ్లలో పెట్టుబడులు పెట్టాలని ఆగస్టు నెలలో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో తీసుకొన్న నిర్ణయాన్ని వెంటనే నిలిపివేయాలని తిరుపతి పార్లమెంట్ తెదేపా అధ్యక్షుడు, తుడా మాజీ ఛైర్మన్ నరసింహయాదవ్ కోరారు. తితిదే ధర్మకర్తల మండలి ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి నియమితులు అయినప్పటి నుంచి వివాదాస్పద నిర్ణయాలతో భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తమిళనాడులో ఉన్న తితిదే ఆస్తుల అమ్మకం, అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి నిధుల కోత, తిరుపతి అవిలాల చెరువు సుందరీకరణ నిధుల నిలిపివేత, గరుడ వారధి నిర్మాణాలకు నిధులు విడుదల చేయకపోవడం వంటి నిర్ణయాలు ఉన్నాయన్నారు. తితిదే డిపాజిట్ల విషయంలో నిర్ణయం వెనక్కి తీసుకోకుంటే తిరుపతిలో తెలుగుదేశం పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు.
మరోవైపు బీసీలను దెబ్బతీసే విధంగా వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తోందని నరసింహ యాదవ్ విమర్శించారు. నిధులు లేకుండా ఆర్బాటంగా బీసీ కార్పొరేషన్లను ప్రకటించారని ఆరోపించారు. కార్పొరేషన్లకు ఛైర్మన్ పదవులు ప్రకటించి నిధులు ఇవ్వకుండా కేవలం కుర్చీలు మాత్రం ఇచ్చారని విమర్శించారు. బీసీల మధ్య చిచ్చు పెట్టడానికే కార్పొరేషన్లను ప్రకటించారని ఆరోపించారు. పదహారు నెలల్లో తమ ప్రభుత్వం బీసీలకు 33 వేల కోట్ల రూపాయలు ఖర్చుచేసిందని గొప్పలు చెప్పుకుంటున్న వైకాపా ప్రభుత్వం... వాటిని ఏం చేశారో వివరాలు చెప్పాలని డిమాండ్ చేశారు.