అన్యమతస్థుడైన ముఖ్యమంత్రి కోసం తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి డిక్లరేషన్ ఎత్తేసే స్థాయికి చేరారని మాజీ మంత్రి జవహర్ ధ్వజమెత్తారు. సీఎం డిక్లరేషన్ ఎందుకు వద్దంటున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ ముందునుంచీ తనకు నచ్చని అంశాలపై ద్వేషభావంతో ఉన్నారని ఆరోపించారు. మంత్రి కొడాలి నానిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంత్రి మాటలపై స్పందించకుండా ముఖ్యమంత్రి మౌనంగా ఉన్నారంటే.. మంత్రి మాటను ప్రభుత్వం సమర్థిస్తుందని అనుకోవాలని మండిపడ్డారు.
వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు మంచి మనస్సుతో తీసుకోవాలంటే అక్కడి ఆచారాన్ని గౌరవించాలని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హితవు పలికారు. ఏపీలో హిందూ దేవాలయాలపై దాడులు ప్రోత్సహించేలా కొందరు మంత్రులు మాట్లాడటం దురదృష్టకరమని ధ్వజమెత్తారు. తిరుమల ఒక్క ఏపీకే పరిమితమైన ఆలయం కాదన్న సోమిరెడ్డి.. ప్రపంచంలోనే ప్రముఖ దేవాలయమని పేర్కొన్నారు. రాష్ట్రంలో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న వారు పద్మనాభస్వామి ఆలయంలోకి షర్టు ధరించి వెళ్లగలరా అని నిలదీశారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో అన్ని మతాలను గౌరవించామని గుర్తు చేశారు. ముస్లింలకు రంజాన్ తోఫా, హిందువులు, క్రైస్తవులకు సంక్రాంతి, క్రిస్మస్ కానుకలిచ్చామని తెలిపారు. పుణ్యక్షేత్రాల్లో అనాదిగా వస్తున్న ఆచారాలను ఉల్లంఘించడానికి మీరెవరని ప్రశ్నించారు. గతంలో ఏమైనా పొరపాట్లు జరిగివుంటే సరిదిద్దాల్సిందిపోయి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించడం సరికాదని హితవు పలికారు.