ఎన్నికలు సజావుగా నిర్వహించే బాధ్యత అధికారులపై ఉందని తెదేపా నేత అమర్నాథ్ రెడ్డి అన్నారు. కుప్పం తెదేపా కార్యాలయానికి వచ్చిన ఆయన.. మీడియాతో మాట్లాడారు. వైకాపా నాయకులు కుప్పంలో తిరుగుతున్నారని.. స్థానికులైన మేము ఇక్కడ తిరిగితే తప్పేంటని? ప్రశ్నించారు. తమను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటని..? నిలదీశారు. కుప్పంలో వైకాపా నేతలు భయానకరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
'కుప్పంలో వైకాపా నేతలు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. అదే మేం వెళ్తే అరెస్టులు చేస్తున్నారు. మమల్ని అరెస్ట్ చేయాల్సిన అవసరమేంటి..? ఒక మున్సిపల్ ఎన్నిక కోసం ప్రభుత్వం.. ఇలాంటి వాతావరణం సృష్టిస్తుందంటే.. రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో ప్రజలు గమనించారు. ఎన్నో సంవత్సరాలుగా చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.. కానీ ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదు' - అమర్నాథ్ రెడ్డి, తెదేపా నేత
ఏం జరిగిందంటే..
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా.. 14వ వార్డు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించటంతో తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. కుప్పం పురపాలిక కార్యాలయం వద్ద ఇటీవల నిరసనకు దిగారు. కుప్పం మున్సిపల్ కమిషనర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెదేపా నిరసనను అడ్డుకునేందుకు పోలీసులు విఫలయత్నం చేశారు. పోలీసులు, తెదేపా శ్రేణుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. మాజీమంత్రి అమర్‌నాథ్‌రెడ్డి చొక్కా చిరిగింది. దీంతో ఆగ్రహించిన తెదేపా శ్రేణులు.. పోలీసుల తీరుకు నిరసనగా రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.