చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్ మండలానికి చెందిన జిల్లా తెదేపా ఉపాధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో.. చర్లోపల్లిలో ఆ పార్టీ నాయకులు అర్థనగ్నంగా నిరసన చేపట్టారు. ఛలో తంబళ్లపల్లి కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడాన్ని ఈశ్వర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.
రెండు రోజుల క్రితం రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి, మరికొందరు తెదేపా నేతలతో కలసి.. అంగళ్లులో చనిపోయిన తేదేపా కార్యకర్త కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళితే, వైకాపా నాయకులు దుర్మార్గంగా దాడి చేయడం దారుణమన్నారు. బీసీ నాయకుడు శంకర్ యాదవ్పై కూడా దాడికి పాల్పడి.. కార్లు ధ్వంసం చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. రాజకీయాల్లో అధికారం శాశ్వతం కాదని.. వైకాపా నాయకులు అది గుర్తు పెట్టుకోవాలని సూచించారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అనుకుని ఉంటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సాగేదా అని ప్రశ్నించారు. ఇకనైనా రౌడీ రాజకీయాలకు చమరగీతం పాడాలని హితవు పలికారు.