తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులతో తిరుపతి నగరం నిత్యం రద్దీగా ఉంటుంది. అలాంటి ప్రాంతంలో భద్రతా లోపాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. పొరుగు రాష్ట్రం తమిళనాడులో ఉగ్ర కదలికలున్నాయన్న నిఘా వ్యవస్థ హెచ్చరికలతో... తిరుపతిలో పోలీసులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. నగర వ్యాప్తంగా భద్రతను పటిష్ఠం చేయాలంటూ అర్బన్ ఎస్పీ అన్బురాజన్ ఆదేశాలు జారీచేయగా... పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. ఇదంతా బాగానే ఉన్నా... ప్రాథమికంగా ఉండాల్సిన భద్రతా ప్రమాణాల్లో కనిపిస్తున్న డొల్లతనమే అసలు సమస్యగా మారింది.
శ్రీనివాసుడి దర్శనం కోసం ఎక్కువ మంది భక్తులు రైళ్లలో తిరుపతికి వస్తుంటారు. అలాంటి ప్రాంతంలో భద్రత గాల్లో దీపంలా మారింది. బ్యాగులు పట్టుకుని స్టేషన్లోకి ఎవరు వస్తున్నారో... ఎవరు పోతున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రయాణికుల సామాన్లను తనిఖీ చేయాల్సిన బ్యాగ్ స్కానర్ పని చేయడంలేదు. మెటల్ సెన్సర్ డిటెక్టర్లు పాడైపోయాయి. స్టేషన్లో నిఘా నేత్రాల సంగతి ఎంత తక్కువ చెబితే అంత మంచింది. పదుల సంఖ్యలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా... వాటి పనితీరు శూన్యం.