Suicide: అనంతపురం జిల్లా పామిడి మండలం జి.ఏ కొట్టాల గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఓ ఎస్సై ప్రేమించి మోసగించాడని.. మనస్తాపంతో ఓ డిగ్రీ విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామానికి చెందిన ఎస్సై విజయ్ కుమార్.. తిరుపతి జిల్లా చంద్రగిరి పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. ముఖం చాటేశాడని.. ఓ డిగ్రీ విద్యార్థిని.. రెండు రోజుల క్రితం పురుగులమందు తాగింది. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ అనంతపురంలో మృతిచెందింది.
ఎస్సై విజయ్ కుమార్ మోసం చేయడం వల్లే తమ కూతురు చనిపోయిందని.. బాధిత యువతి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. అయితే సదరు ఎస్సై.. గతంలో కూడా ఓ అమ్మాయిని మోసం చేయడంతో.. ఆమె దిశ పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఉద్యోగం పోతుందని.. ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆ ఘటన మరవకముందే మరోసారి.. ప్రేమించి మోసం చేయడంతో.. గ్రామస్తులు ఎస్సై పై ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతి మృతికి కారణమైన.. అతనిపై కేసు నమోదు చేసి సస్పెండ్ చేయాలని మృతురాలి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.
అదే గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థినితో పాటు మరో యువతిని ప్రేమించాడని.. ఎస్సైపై ఆరోపణలు వచ్చాయి. రెండో యువతి దిశ పోలీసులను ఆశ్రయించడంతో.. ఉద్యోగం పోతుందనే కారణంతో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వివాహితుడైన ఎస్.ఐ. విజయకుమార్ మరో యువతిని ప్రేమ పేరుతో మోసం చేయటం చర్చలకు తావిస్తోంది.