ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

శ్రీవారి ఆభరణాల లెక్కలు.. రికార్డుల్లో తప్పుల తడకలు! - story on ttd treasurery

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆధ్యాత్మిక క్షేత్రం. ప్రపంచం నలుమూలల నుంచి శ్రీవారిని దర్శించుకొనేందుకు వచ్చే భక్తులకు సేవలు అందించడంతో పాటు.... భక్తులు సమర్పించే కానుకలకు జవాబుదారీగా వేలమంది ఉద్యోగులు, అధికారులు పని చేస్తుంటారు. ముగ్గురు ఐఏఎస్‌లు, ఒక ఐపీఎస్‌ అధికారి నిర్వహణ, పర్యవేక్షణలో ఉండే శ్రీవారి ఖజానాలో.. రికార్డులకు ఎక్కిన కానుకలు మాయమవుతున్నాయి. మరో వైపు రికార్డుల్లో లేని వస్తువులు బయటపడుతున్నాయి.

story on ttd treasurery mistakes

By

Published : Sep 19, 2019, 10:05 PM IST

శ్రీవారి ఆభరణాల లెక్కలు.. రికార్డుల్లో తప్పుల తడకాలు!

ఆపదలు తొలగించేవాడన్న భక్తి భావనను తిరుమలేశుడి భక్తులు గుండెల్లో నింపుకొని ఉంటారు. మొక్కులు తీర్చుకోవడంలో అలసత్వం ప్రదర్శిస్తే... వడ్డీతో సహా వసూలు చేస్తాడన్న భయాన్ని వ్యక్తం చేస్తారు. ఈ నేపథ్యంలో స్థితిమంతులే కాదు... కడు పేదలు స్వామివారికి మొక్కుల పేరిట కానుకలు సమర్పిస్తూనే ఉంటారు. ఫలితంగా.. ఏటా కలియుగ వైకుంఠనాథుని హుండీ ఆదాయం అంతకంతకూ పెరుగుతూనే ఉంది.

కోటీశ్వరుడి నుంచి నిరుపేద వరకు భక్తిభావంతో స్వామివారికి సమర్పించే ప్రతి కానుకకు తితిదే అంతే ప్రాధాన్యత కల్పించి లెక్కాపత్రం తయారు చేస్తుంది. శ్రీవారి హుండీలో కానుకగా వచ్చే వెండి, బంగారు ఆభరణాలను తిరుపతి ఖజానాకు తరలిస్తుంది. ప్రతి వస్తువునూ జాగ్రత్తగా...గొలుసు అయితే ఏ తరహా అన్న వివరాలు.... హారాలు అయితే అందులో ఉన్న రంగురాళ్లు, ముత్యాలు, రత్నాల సంఖ్య వంటి వివరాలతో సవివరంగా రికార్డుల్లో చేర్చి భద్రపరుస్తుంది. కానీ... ఇటీవల జరిగిన కొన్న సంఘటనలు స్వామి వారి కానుకల భద్రత, హుండీ ద్వారా సమకూరే ఆభరణాల నమోదు తదితర అంశాలను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.

కొద్ది రోజుల క్రితం తిరుపతిలోని తితిదే ఖజానా నుంచి ఒక వెండి కిరీటం, రెండు బంగారు కమ్మలు, రెండు బంగారు గొలుసులు మాయమవడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఏఈవో స్థాయి అధికారిని ఇందుకు బాధ్యుడిని చేస్తూ…ఆయన జీతం నుంచి దాదాపు ఏడున్నర లక్షల రూపాయలు రికవరీ చేయాలని నిర్ణయించడం శ్రీవారి భక్తులను ఆశ్చర్యపరిచింది.

పరిశీలిస్తామంటున్న అధికారులు

పటిష్టమైన నిఘా మధ్య జరిగే తిరుమల హుండీ కానుకల భద్రపరిచే ప్రక్రియలో అదనంగా రావడానికి, కనిపించకుండా పోవడానికిగానీ అవకాశమే ఉండదు. కానీ.. ఇటీవల 5 కిలోల పైబడిన వెండి కిరీటం మాయమవడం...రికార్డుల్లో లేని 11.778 కిలోల వెండి, రెండు కిలోల ముత్యాలతో పాటు పలు వస్తువులు అదనంగా ఉండడం.. కొత్త అనుమానాలకు తావిస్తోంది. ఖజానా భద్రత నిర్వహణ ప్రశ్నార్థకమైంది. ఈ నేపథ్యంలో ఖజానాలో భారీ మొత్తంలో వెండి, బంగారు వస్తువులు భద్రపరుస్తారని నిర్వహణలో మానవ తప్పిదాలు ఏమైనా జరిగాయా అన్న దానిపై సమీక్షిస్తామని అధికారులు చెబుతున్నారు.

సాంకేతికత అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కిలోల బరువున్న కిరీటం మాయమవడం, కొన్ని అదనంగా రావడం.. ఖజానా నిర్వహణ డొల్లతనాన్ని చాటుతోంది. ఈ నేపథ్యంలో శ్రీవారికి సమర్పించే కానుకలు పక్కదారి పట్టడం లేదన్న భరోసా... భక్తులకు కల్పించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details