శ్రీవారి దర్శన టికెట్లు(visiting tickets) ఉంటేనే తిరుమలకు అనుమతిస్తున్నట్లు తితిదే(TTD) వెల్లడించింది. కొవిడ్ టీకా ధ్రువపత్రం, ఆర్టీపీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్ ఉండాలని స్పష్టం చేసింది. చాలామంది భక్తులు దర్శన టికెట్లు లేకుండా వస్తున్నందున.. వారు అలిపిరి(alipiri) నుంచి వెనుతిరిగి పోతున్నారని తితిదే అధికారులు తెలిపారు. వీరి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
వెనుకబడిన వర్గాలకూ దర్శనం...
తిరుమల బ్రహ్మోత్సవాల్లో వెనుకబడిన వర్గాలకు శ్రీవారి దర్శనం(srivari visiting) కల్పించాలని తితిదే నిర్ణయించింది. రోజుకు వెయ్యి మంది వెనుకబడిన వర్గాలకు శ్రీవారి దర్శనం ఉంటుందని అధికారులు తెలిపారు. తితిదే ఆలయాలు నిర్మించిన ప్రాంతాల్లోని ప్రజలకూ శ్రీవారి దర్శనం కల్పిస్తామన్నారు. ఈ నెల 7 నుంచి 14 వరకు శ్రీవారి దర్శనం కల్పించనున్న తితిదే... రోజుకు వెయ్యిమందికి ఉచిత రవాణా, భోజనం, వసతి సౌకర్యం ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది.
ఏకాంతంగా బ్రహ్మోత్సవాలు...
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఈసారీ ఏకాంతంగానే జరగనున్నాయి. కరోనా మూడో దశ హెచ్చరికల దృష్ట్యా అక్టోబర్ 7 నుంచి 15 వరకు జరిగే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏకాంతంగానే నిర్వహిస్తామని.. తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. బ్రహ్మాండనాయకుని.. బ్రహ్మోత్సవాల్లో కీలకమైన వాహనసేవలన్నీ ఇక ఆలయ ప్రాకారానికే పరిమితం కానున్నాయి. తిరుమాఢ వీధుల్లో ఆ దేవదేవుడి వాహన సేవలు చూసి తరిద్దామనుకున్న.. భక్తులకు ఈసారీ నిరాశే మిగలనుంది.