Srivari Hundi Income: తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలోనే అత్యధిక హుండీ ఆదాయం ఈ ఏడాది మే నెలలో నమోదయ్యిందని ఆలయ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఒక్క మే నెలలోనే శ్రీవారి హుండీ ఆదాయం రూ.130.29 కోట్ల భారీ మొత్తం సమకూరిందన్నారు. శుక్రవారం ఉదయం తిరుమల అన్నమయ్య భవన్ నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
మే నెలలో శ్రీవారిని 22 లక్షల 62 వేల మంది భక్తులు దర్శించుకున్నారని వివరించారు. 1 కోటి 86 వేల లడ్డూలను భక్తులకు విక్రయించామని తెలిపారు..టైంస్లాట్ సర్వదర్శన విధానాన్ని పునఃప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. వేసవి సెలవులు ముగిసే వరకు టైం స్లాట్ దర్శనాలు ప్రారంభించలేమని వెల్లడించారు. టైం స్లాట్ విధానంలో వచ్చే సమస్యలను అధికమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. వేసవి సెలవుల్లో తిరుమల శ్రీవారి దర్శనార్థం విశేషంగా విచ్చేస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తితిదేలోని అన్ని విభాగాలు సమన్వయంతో సేవలందిస్తున్నాయన్నారు. తిరుమలలో భక్తుల ఎక్కువ రద్దీ ఉన్న సమయంలో శ్రీవారి దర్శనం కోసం దాదాపు 2 రోజుల పాటు వేచి ఉండాల్సి వస్తోందన్నారు. అటువంటి సమయంలో భక్తులు ఓపికతో ఉండాలని విజ్ఞప్తి చేశారు.