She Autostand in tirupathi: తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తిరుపతి తరలివస్తుంటారు. రాత్రి వేళల్లో ఒంటరిగా వచ్చిన మహిళలు గమ్యస్థానాలకు చేరడానికి కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య పరిష్కారానికి తిరుపతి పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మహిళలు నిర్వహిస్తున్న ఆటోలకు పింక్ కలర్ టాప్ ఏర్పాటు చేయడంతోపాటు మహిళా ఆటోడ్రైవర్ల కోసం ప్రత్యేకంగా ఆటోస్టాండ్‌లు ఏర్పాటు చేశారు. దీంతో ప్రయాణికులకు, మహిళా ఆటో డ్రైవర్లకు భద్రత కల్పించనట్లవుతోంది.
స్వచ్ఛంద సంస్థ రాస్ ఆర్థిక సహకారంతో తిరుపతి నగరంలో 350 మంది మహిళలు ఆటో డ్రైవింగ్‌లో శిక్షణ పొందారు. 150 మంది వరకు ఆటోలు నడుపుతూ ఉపాధి పొందుతున్నారు. మహిళా ఆటోడ్రైవర్లకు భద్రత కల్పించే లక్ష్యంతో ప్రత్యేకంగా 3 ఆటోస్టాండ్‌లు ఏర్పాటు చేశారు. అత్యంత రద్దీగా ఉండే ఆర్టీసీ బస్టాండ్ తో పాటు రుయా ఆసుపత్రి, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ప్రాంతాల్లో మహళలకు ప్రత్యేకంగా ఆటోలు నిలుపుకోవడానికి అవకాశం కల్పించారు. ప్రత్యేకంగా తమ కోసం స్టాండ్‌లు ఏర్పాటు చేయడం పట్ల మహిళా ఆటో డ్రైవర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్త్రీలు ఆటోలు నడుపుతున్నందున భయం లేకుండా ప్రయాణం చేయగలగుతున్నామని మహిళా ప్రయాణికులు చెబుతున్నారు.