తిరుమల అన్నమయ్య భవనంలో తితిదే ఉన్నతాధికారులు, షిర్డీ సంస్థాన్ అధికారుల బృందంతో ఛైర్మన్ సమావేశం నిర్వహించారు. ఆలయంలో కరోనా వ్యాప్తి కట్టడికి తితిదే తీసుకుంటున్న జాగ్రత్త చర్యలను, భక్తులకు కల్పిస్తున్న సదుపాయాల తీరును పరిశీలించడానికి షిర్డీ సంస్థాన్ అధికారులు తిరుమలకు వచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో కొవిడ్-19 పరిస్థితుల్లో తిరుమలలో భక్తులకు కల్పిస్తున్న దర్శనం, వసతి, క్యూలైన్ల నిర్వహణ, అన్నదానం, శ్రీవారి సేవ, అకౌంట్స్, లడ్డూ ప్రసాదం పంపిణీ కౌంటర్ల నిర్వహణపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.
అలాగే తితిదే నిర్వహిస్తున్న సామాజిక, ధార్మిక కార్యక్రమాలను తెలియజేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన అనంతరం షిర్డీలో భక్తులకు దర్శనం కల్పించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై షిర్డీ శ్రీ సాయిబాబా సంస్థాన్ అధికారులు తితిదే నుంచి సూచనలు, సలహాలు స్వీకరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనల మేరకు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా, ఎలాంటి లోపాలు లేకుండా ఆచార సంప్రదాయాల ప్రకారం వైభవంగా నిర్వహిస్తున్నట్టు తితిదే ఛైర్మన్ వివరించారు. ప్రపంచంలోని హిందూ దేవాలయాల్లో మొదటిస్థానంలో ఉన్న తితిదే దేశంలోని ఇతర ప్రముఖ హిందూ దేవాలయాల్లో భక్తులు సౌకర్యవంతంగా దర్శనం చేసుకునే అంశంపై ఆలోచనలు పంచుకుంటుందని చెప్పారు.