సర్వదర్శనం టోకెన్లు తీసుకుని శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులకు నిరాశ తప్పదు. జనవరి 3 వరకు తిరుపతి మినహా మిగిలిన ప్రాంతాలవారు వస్తే ఇబ్బందులు పడాల్సిందే. ఆదివారం రాత్రికే 24వ తేదీ వరకు సర్వదర్శన టోకెన్లను అధికారులు ఇచ్చేశారు. దీనివల్ల సోమ, మంగళవారం ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు తిరుపతి నుంచి వెనుదిరిగి వెళ్లాల్సిందే. మరోవైపు 25 నుంచి పది రోజులపాటు తిరుపతిలోని స్థానికులకే సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తామని తితిదే అధికారులు స్పష్టం చేశారు. దీంతో జనవరి 3 వరకు తిరుపతికి వచ్చే సామాన్య భక్తులకు సర్వదర్శనం లేనట్లే. తిరుపతిలో ఏర్పాటు చేసిన రెండు కౌంటర్ల ద్వారా రోజుకు 10 వేల మంది భక్తులకు ఒకరోజు ముందు సర్వదర్శన టోకెన్లు జారీ చేస్తామని అధికారులు గతంలో ప్రకటించారు. అయితే ఆదివారం నాటికే గురువారంవరకు ఉన్న సర్వదర్శనం టోకెన్లు ఇచ్చేశారు.
సమాచారం లేకుండానే..
వైకుంఠ ఏకాదశి నుంచి పది రోజులపాటు వైకుంఠ ద్వారం తెరిచి ఉంచాలని అధికారులు నిర్ణయించారు. భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవచ్చని భావించారు. ఇదే సమయంలో తితిదే ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ప్రత్యేక దర్శన టోకెన్లను ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. నిత్యం శ్రీవారి ఆన్‌లైన్ వెబ్‌సైట్ చూసే భక్తులు వెంటనే టికెట్లు నమోదు చేసుకున్నారు. మిగిలిన వారికి దొరకని పరిస్థితి. సర్వదర్శనం టోకెన్లు తీసుకుని వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవచ్చని కొందరు భావిస్తే... తితిదే అధికారులు రెండు రోజుల క్రితమే సర్వదర్శన టోకెన్లను స్థానికులకే పరిమితం చేసినట్లు చెప్పారు.