తిరుమల అన్నప్రసాద కేంద్రంలో ‘సంప్రదాయ భోజనం’ పేరుతో అందుబాటు ధరలో నూతన కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తితిదే ఈవో కె.ఎస్. జవహర్‌రెడ్డి, తితిదే అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి వెల్లడించారు. ఆదివారం తిరుమల, తిరుపతిలలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవాల్లో వారు వేర్వేరుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మరో 15 నుంచి 30 రోజుల్లో గో ఆధారిత సాగు ద్వారా పండించిన సరకులతో తయారుచేసే ‘సంప్రదాయ భోజనం’ అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
అన్ని వసతి సముదాయాలు, అతిథిగృహాల్లోని గదుల్లో గీజర్‌లను ఏర్పాటు చేసి డిసెంబరు కల్లా అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. అలిపిరి నడకమార్గాన్ని సెప్టెంబరు చివరికల్లా పూర్తిచేసి భక్తులను అనుమతిస్తామని తెలిపారు. కోయంబత్తూరుకు చెందిన ఆశీర్వాద్ ఆయుర్వేద ఫార్మసీ సహకారంతో 4 నెలల్లో పంచగవ్య ఉత్పత్తులైన సబ్బు, షాంపు, ధూప్‌స్టిక్స్, ఫ్లోర్ క్లీనర్ తదితర 15 రకాల ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.