ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నిర్లక్ష్యమే 'రుయా' ఘటన కారణం..ప్రాథమిక విచారణలో వెల్లడి ! - రుయా ఆసుపత్రి ఘటన తాజా వార్తలు

తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది మృతి చెందిన ఘటనపై...శాఖాపరమైన విచారణ జరుగుతోంది. ఎస్వీ వైద్యకళాశాల ప్రిన్సిపల్‌కు ప్రాథమిక విచారణ బాధ్యతలు అప్పగించారు. ప్రమాదాన్ని పరిశీలిస్తే...పర్యవేక్షణాధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. ట్యాంక్‌లో ఆక్సిజన్ నిల్వలపై అప్రమత్తం చేయలేదని అంటున్నారు.

Ruya Hospital Tragedy Internal Enquiry
నిర్లక్ష్యమే 'రుయా' ఘటన కారణం

By

Published : May 13, 2021, 4:51 AM IST

రాయలసీమలోనే అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒకటిగా పేరుగాంచిన తిరుపతి రుయా కొవిడ్‌ వైద్యశాలలో...సోమవారం ఆక్సిజన్‌ అందక 11 మంది ప్రాణాలు వదిలిన ఘటనపై అంతర్గత విచారణ కొనసాగుతోంది. ఆసుపత్రిలోని వెయ్యి పడకల్లో 700 ఆక్సిజన్‌ ఆధారమితమైనవి. వీటికి రోజుకు 15 వేల లీటర్ల ద్రవరూప ఆక్సిజన్‌ నిల్వలు అవసరమవుతాయి. ఈ లెక్కలు తెలిసిన అధికారులు...సరిపడా ఆక్సిజన్‌ను అందుబాటులో పెట్టుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. శ్రీపెరంబుదూరు నుంచి ఉదయం బయల్దేరాల్సిన ట్యాంకర్ రాత్రి వరకూ రాకపోయినా...ఈ విషయాన్ని సమయానికి జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లలేదని విచారణలో వెల్లడైనట్లు సమాచారం.

తిరుపతి స్విమ్స్‌ ఆసుపత్రిలో బుధవారం ఆక్సిజన్‌ నిల్వలు తగ్గుతున్న సమయంలో...ఆక్సిజన్‌ ఆపరేటర్స్‌ వెంటనే అప్రమత్తమయ్యారు. డైరెక్టర్‌ నుంచి కలెక్టర్‌ వరకూ అందరికీ సమాచారమిచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు... సమయానికి ఆక్సిజన్‌ ట్యాంకర్‌ ఆసుపత్రికి చేరుకునేలా ఏర్పాటు చేశారు. రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్‌ ఆపరేటర్లు ఈ విధంగా స్పందించి ఉంటే...సోమవారం 11 మంది మృతిచెందేవారు కాదనే వాదన వినిపిస్తోంది.

రుయా ఘటనలో ఆక్సిజన్‌ ట్యాంకర్‌ పరిశీలన కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక పర్యవేక్షణాధికారి...సరిగా బాధ్యతలు నిర్వర్తించలేదని శాఖాపరమైన విచారణలో వెల్లడైనట్లు సమాచారం. శ్రీ వేంకటేశ్వర వైద్యకళాశాల ప్రిన్సిపల్ జయాభాస్కర్, అనస్తీషియా హెచ్​వోడీ జమున, రుయా మాజీ సూపరింటెండెంట్ సిద్ధానాయక్‌తోపాటు మరో ఇద్దరు సభ్యులతో ఏర్పాటైన కమిటీ...అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతోంది. కనీసం మ్యానిఫోల్డ్ సిలిండర్లను పెద్దసంఖ్యలో అందుబాటులో ఉంచుకోకుండా అప్పటికప్పుడు సిలిండర్ల కోసం అన్వేషించడమే ఆక్సిజన్‌ సరఫరా అంతరాయానికి కారణమైందనే వాదన వినిపిస్తోంది. ఈ కమిటీ త్వరలోనే ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదిక అందించనుంది.

నిర్లక్ష్యమే 'రుయా' ఘటన కారణం

ఇదీచదవండి

'మూతపడిన ప్లాంట్లు గుర్తిస్తున్నాం.. ఆక్సిజన్ ఉత్పత్తికి చర్యలు తీసుకుంటున్నాం'

ABOUT THE AUTHOR

...view details