తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది కొవిడ్ రోగులు మృతిచెందిన తర్వాత అధికారులు అప్రమత్తమయ్యారు. వెనువెంటనే వైద్యసేవలు పూర్తిస్థాయిలో పునరుద్ధరించారు. ఆక్సిజన్ నిల్వలు పెంచారు. తమిళనాడు నుంచి మరో ఆక్సిజన్ ట్యాంకర్ రుయాకు తెప్పించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని రుయా సూపరింటెండెంట్ డాక్టర్ భారతి తెలిపారు. ఆక్సిజన్ ప్రెజర్ తగ్గడం వల్లే దుర్ఘటన జరిగిందన్నారు. ట్యాంకర్స్ సకాలంలో రాకపోవడం ప్రాణవాయువు అందక రోగులు ఇబ్బందిపడ్డారని.. ప్రస్తుతం వారంతా కోలుకున్నారని చెప్పారు.
ప్రతిపక్షాల మండిపాటు..
రుయా విషాదంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఘటనపై పూర్తి సమాచారం సేకరించి పంపాలని.. ఏడుగురు సభ్యులతో నిజనిర్ధరణ కమిటీ నియమించారు. అధ్యక్షుడి ఆదేశాల మేరకు బాధితులను పరామర్శించేందుకు రుయా వద్దకు వచ్చిన తెలుగుదేశం నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో మృతుల బంధువులను కలిసేందుకు వెళ్లనివ్వాలంటూ ఆస్పత్రి ఎదుట సీపీఐ, తెలుగుదేశం నాయకులు ఆందోళన నిర్వహించారు. విపత్తు నిర్వహణ చట్టం కింద.. కొవిడ్ కర్ఫ్యూ నిబంధనలు అమలులో ఉన్నందున ఆందోళనలు విరమించాలని పోలీసులు వారిని కోరారు. ఎంతకీ వెనక్కి తగ్గకపోవడం వల్ల.. అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు.
రుయాకు వచ్చేందుకు యత్నించిన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణను నగరి పోలీసులు అడ్డుకొన్నారు. అక్కడి నుంచి స్వగ్రామం ఐనంబాకం వద్దకు తీసుకెళ్లి గృహ నిర్భంధం చేశారు. ప్రాణవాయువు అందక రోగులు చనిపోవడం అన్నది ప్రభుత్వం చేతకానితనానికి నిదర్శనమని నారాయణ మండిపడ్డారు. దాదాపు 26 మంది చనిపోతే కేవలం 11 మంది చనిపోయినట్లు చెబుతోందని ఆక్షేపించారు.
పాలకులపై చర్యలు తీసుకోవాలి: వైకాపా ఎంపీ రఘురామకృష్ణమరాజు