పోటీ పేరుతో ప్రపంచమంతా పరుగులు పెడుతోంది. ఉత్తమ భవిష్యత్ సాధనలో యువతరం తీవ్రఒత్తిడి ఎదుర్కొంటుంది. సమాజంలో హోదా, నలుగురిలో గుర్తింపు కోసం చిన్నచిన్న సంతోషాలకు సైతం దూరమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో నచ్చిన జీవితాన్ని గడుపుతూనే...తన కెరీర్‌ను విభిన్నంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నాడు...తిరుపతి యువకుడు రూపేష్. ప్రకృతితో మమేకవుతూ...ఆ అనుభవాలు ఆన్‌లైన్ ద్వారా అందరితో పంచుకుంటున్నాడు. రాయలసీమలోనే మొట్టమొదటి మోటో వ్లాగర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.
గెట్ యువర్ లైఫ్ బ్యాక్, గో బ్యాక్ టూ ది రూట్స్.. ఇదే మోటో వ్లాగర్ రూపేష్ నినాదం. తిరుపతిలోని బైరాగిపట్టెడకు చెందిన రూపేష్ విభిన్న అభిరుచితో ముందుకు సాగుతున్నాడు. మోటార్ బైక్ పై సుదూర ప్రయాణం చేస్తూ... రకరకాల ప్రదేశాలు, అక్కడి వాతావరణాన్ని అందంగా కెమెరాలో బంధిస్తున్నాడు. ప్రకృతి ప్రేమికులకు ఈ కొత్త ప్రాంతాల గురించి సమగ్ర సమాచారం అందిస్తున్నాడు.
విదేశం నుంచి స్వదేశానికి...
తిరుపతి విద్యానికేతన్‌లో బీటెక్ పూర్తి చేసిన రూపేష్...బ్రిటన్‌లో ఎంబీఏ చదువుతున్నాడు. కరోనా వల్ల స్వదేశానికి వచ్చిన ఈ యువకుడు...అక్కడ ఉన్నప్పుడు వారాంతాలు, సెలవులు, ఖాళీ సమయాల్లో దూరప్రాంతాలకు ఒంటరిగా బైక్ పై ప్రయాణించేవాడు. ఆ అనుభవాలు వ్లోగ్ రూపంలో ప్రకృతి ప్రియులకు అందించేవాడు. అలా మోటోవ్లాగర్‌గా నెటిజన్లకు చేరువయ్యాడు.
నూతన ఆలోచనకు ప్రేరణ...
ఉన్నత చదువులకు బ్రిటన్ వెళ్లక ముందు రూపేష్ కొంతకాలం బెంగుళూరులో ఉన్నాడు. ఆ సమయంలో ఒకసారి బందీపూర్ నేషనల్ పార్క్‌కి బైక్ పై స్నేహితులతో కలిసి వెళ్లాడు. అక్కడి వాతావరణం, వన్యమృగాలు అతి దగ్గరగా చూడటం తనలో ఓ కొత్త ఆలోచనకు ప్రేరణనిచ్చాయి. దేశంలోని విభిన్న ప్రాంతాలను సందర్శించాలని నిర్ణయానికి వచ్చాడు. ప్రతివారం బైక్‌పై సరికొత్త ప్రాంతాలకు వెళ్లడం అలవాటుగా మార్చుకున్నాడు. ఆ ప్రయాణాల్లోని అనుభవాలు, స్థానిక పరిస్థితుల్ని స్నేహితులతో పంచుకునేందుకు వీడియోలు చేయటం మొదలు పెట్టాడు.