తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్న భాజపా-జనసేన ఉమ్మడి అభ్యర్థి, విశ్రాంత ఐఏఎస్ అధికారిని రత్నప్రభ ఇవాళ హైదరాబాద్‌లో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో సమావేశమయ్యారు. సోమవారం నామపత్రాలు సమర్పించాలని రత్నప్రభ నిర్ణయించుకున్నారు. ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నందున ఈ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పవన్ కల్యాణ్‌తో భాజపా ముఖ్య నేతలు చర్చించారు.
భాజపా జాతీయ కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి, రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి సునీల్ దియోదర్, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తిరుపతి లోక్‌సభ పరిధిలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం చేసిన సహకారాన్ని వివరిస్తూ ఇప్పటికే ఓ వీడియోను విడుదల చేసిన విషయాన్ని భాజపా నేతలు ఈ సమావేశంలో ప్రస్తావించారు.