రాష్ట్రవ్యాప్తంగా రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచే సూర్యనారాయణ ఆలయాల వద్ద రద్దీ నెలకొంది. ఆదిత్యాయ ఆరోగ్య ప్రదాయ అంటూ ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడికి భక్తులు పూజలు నిర్వహిస్తూ..పాలాభిషేకాలు చేస్తున్నారు.
తిరుమలలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ స్వామి వారు సప్తవాహనాలపై దర్శనమివ్వనుండగా.. ఉదయం సూర్యప్రభ వాహనంపై దర్శనమిస్తున్నారు. ఉదయం చినశేష వాహనం, గరుడ వాహన సేవలు, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల వాహన సేవలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం రంగనాయకుల మండపంలో చక్రస్నానం నిర్వహిస్తారు. రాత్రికి చంద్రప్రభ వాహన సేవ ఉంటుంది. కొవిడ్ కారణంగా స్వామి వారి వాహన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. రథసప్తమి సందర్భంగా తితిదే అధికారులు పలు సేవలు రద్దు చేశారు. కల్యాణోత్సవం, ఊంజల్ సేవలు, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు రద్దు చేశారు.
శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఆదిత్యుని జయంతోత్సవ వేడుక మొదలైంది. అర్థరాత్రి నుంచే అంగరంగ వైభోగంగా రథసప్తమి వేడుకలకు అంకురార్పణ జరిగింది. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఉపముఖ్యమంత్రి ధర్మాన.. ఈసారి తొలి పూజ చేశారు. దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, సభాపతి తమ్మినేని సీతారాం, విశాఖ ఐజీ రంగారావు..స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం ఏడు గంటల వరకు స్వామి వారి మూలవిరాట్టుకు క్షీరాభిషేకం జరిగింది. అనంతరం సూర్యనారాయణ స్వామి వారు నిజరూప దర్శనంతో భక్తులకు సాయంత్రం నాలుగు గంటల వరకు దర్శనం ఇస్తారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి పుష్పాలంకరణ సేవ, సర్వదర్శనం కల్పిస్తారు. అనంతరం స్వామివారికి ఏకాంతసేవ గావించి.. పవలింపు సేవతో ఉత్సవం ముగిస్తోంది. టెక్కలిలోని సూర్యనారాయణ స్వామి ఆలయంలోనూ అర్ధరాత్రి నుంచే భక్తులు క్షీరాభిషేకాలు నిర్వస్తున్నారు.