Anarchy Private ambulance drivers: తిరుపతి జిల్లాలోని గూడూరు ప్రభుత్వాస్పత్రి వద్ద ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లు అరాచకం సృష్టించారు. మృతదేహాన్ని ఇతర వాహనాల్లో తరలించకుండా అడ్డుకున్నారు. కోట మండలం తిమ్మనాయుడుపాలెం గ్రామానికి చెందిన యువకుడు.. నిన్న మనుబోలు సమీపంలో వాహన ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. గూడూరు ప్రభుత్వాస్పత్రిలో మృతదేహానికి పంచనామా నిర్వహించారు.
మృతదేహాన్ని గ్రామానికి తీసుకెళ్లేందుకు ప్రైవేటు అంబులెన్స్ డ్రైవర్లు రూ.4 వేలు డిమాండ్ చేశారని బాధితులు ఆరోపించారు. 17 కి.మీ. దూరానికి రూ.4 వేలు అడగడమేంటని బతిమిలాడినట్లు తెలిపారు. కూలీ పనులు చేసుకునేవాళ్లమని చెప్పినా అంబులెన్స్ డ్రైవర్లు కనికరించలేదని వాపోయారు. మరో వాహనం పిలుచుకుంటే అంబులెన్స్ డ్రైవర్లు అడ్డుకున్నారని బాధితులు చెప్పారు. కోట నుంచి తెలిసినవారి అంబులెన్స్‌ను పిలిపించుకోగా.. అందులో మృతదేహాన్ని తీసుకెళ్లనీయకుండా డ్రైవర్లు అడ్డుకున్నారని.. ఆ అంబులెన్స్ డ్రైవర్‌పై దాడి చేశారని ఆరోపించారు.