తిరుపతి ఉపఎన్నిక సన్నద్ధత, వ్యూహరచనపై లోక్‌సభ పరిధిలోని 7 శాసనసభ నియోజకవరాల ఇన్‌ఛార్జులు, ముఖ్యనేతలతో... తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. శాసనసభ నియోజకవర్గాల వారీగా మండలస్థాయి నేతలతో విడివిడిగానూ భేటీ అయ్యారు. 2024 సాధారణ ఎన్నికలకు ముందు జరుగుతున్న పెద్ద ఎన్నికైన తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికను... పార్టీ శ్రేణులు, నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని చంద్రబాబు నిర్దేశించారు.
పురపాలక ఎన్నికల్లో అధికార పక్షం ఎన్ని ఇబ్బందులు పెట్టినా... స్థానిక నాయకులు ధైర్యంగా ప్రతిఘటించిన తీరును చంద్రబాబు ప్రశంసించారు. తిరుపతి ఉపఎన్నికల్లోనూ అక్రమ కేసులు, నిర్బంధాలతో దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నారని.. అలాంటి వాటికి భయపడాల్సిన పనిలేదని భరోసా ఇచ్చారు. ఇకపై పనిచేసే వారికే ప్రాధాన్యం ఇస్తామన్న చంద్రబాబు... పార్టీకి విధేయంగా ఉన్నారనో, సామాజిక సమీకరణాల కోసమో ఎవర్నీ భరించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల పర్యవేక్షణకు... అచ్చెన్నాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, లోకేశ్, బీదా రవిచంద్ర, పనబాక కృష్ణయ్యతో కమిటీ ఏర్పాటు చేశారు.
తిరుపతి ఉపఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చంద్రబాబు కార్యాచరణ సిద్ధం చేశారు. చిత్తూరు జిల్లా పరిధిలోని మూడు అసెంబ్లీ స్థానాల కోసం ఒకటి, నెల్లూరు జిల్లా పరిధిలోని నాలుగు స్థానాల కోసం మరొకటి కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ రెండు జిల్లాలకు చెందిన ఒక ముఖ్య నాయకుడిని, మరో మాజీమంత్రిని... ఒక్కో శాసనసభ నియోజకవర్గానికి ఇన్‌ఛార్జులుగా నియమించారు.