మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి తిరుమల శ్రీవారంటే అచంచలమైన భక్తి భావాలుండేవి. రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన తొలి అధికారిక పర్యటన తిరుమలకే. 2012 జులైలో రాష్ట్రప్రతి హోదాలో తొలిసారి తిరుమలలో పర్యటించిన ప్రణబ్ ముఖర్జీ... శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అనంతరం అప్పుడు నూతనంగా నిర్మించిన నందకం యాత్రికుల వసతి గృహాలను ఆయన ప్రారంభించారు. అదే సమయంలో ధర్మగిరి వేద పాఠశాలను సందర్శించిన ఆయన... స్నాతకోత్సవంలోనూ పాల్గొన్నారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు వేయాల్సిన తొలి ఓటును నాటి తితిదే ఛైర్మన్, కాంగ్రెస్ ఎంపీ కనుమూరి బాపిరాజును వేయమనడం స్వామి వారిపై ప్రణబ్కున్న భక్తికి ఉదాహరణగా చెప్పుకుంటారు. రాష్ట్ర విభజన తర్వాత 2015లో వేసవి విడిది కోసం హైదరాబాద్ వచ్చిన ప్రణబ్ ముఖర్జీ.... రెండు రోజుల పాటు తిరుమల, తిరుపతిలో పర్యటించారు. 2016 డిసెంబర్లో ముచ్చటగా మూడోసారి రాష్ట్రపతి హోదాలో వచ్చిన ప్రణబ్.... తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు తిరుచానూరును సందర్శించారు. వీవీఐపీలు సాధారణంగా వెళ్లని కపిలతీర్థం శ్రీకపిలేశ్వర స్వామి వారి ఆలయాలను సైతం దర్శించుకోవటం విశేషం. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గవర్నర్ నరసింహన్ ప్రణబ్ వెంటే ఉండి ఆలయ విశిష్ఠతలను ఆయనకు వివరించారు.