తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో..వైకాపా అభ్యర్థి గురుమూర్తిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ఓటర్లను కోరారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం పరిధిలోని..గ్రామాల్లో ప్రచారం నిర్వహించిన మంత్రి కన్నబాబు తొండమనాడులో ఎడ్లబండిపై ఎక్కి..ప్రచారం చేశారు. వైకాపా ప్రవేశపెట్టిన పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ, తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని..అభ్యర్థించారు. వైకాపాతోనే రైతు అభివృద్ధి జరుగుతుందని కన్నబాబు ప్రజలకు వివరించారు.
తెదేపా నాయకులు..విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సహా..పలువురు ముఖ్య నేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో..పార్టీ నాయకులతో సమావేశమైన అచ్చెన్నాయుడు..అనుభవమున్న పనబాక లక్ష్మీని గెలిపించాలని కోరారు. పుర ఫలితాల్లో.. వైకాపా ఎన్నో అడ్డదారులు తొక్కిందని విమర్శించారు. భాజపాలో జగన్ కోవర్టులు ఉన్నారని..వారంతా నోరు తెరిస్తే చంద్రబాబును విమర్శించడం తప్ప.. జగన్ జోలికి వెళ్లరని ఎద్దేవా చేశారు. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలో ఏర్పాటు చేసిన..ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి అమర్‌నాథ్ రెడ్డి.. స్థానిక సమస్యలు, వైకాపా పాలనలో పెరిగిన ధరలపై ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో తేదేపా అభ్యర్థిని గెలిపించాలని.. మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఓటర్లను కోరారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం వాంపల్లెలో పర్యటించిన ఆయన..స్థానిక తేదేపా కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. వైకాపా రెండేళ్ళ కాలంలో అవినీతి అక్రమాలను బూత్ స్థాయి నుంచి ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.