తిరుపతి వేదికగా ఇవాళ్టి నుంచి నాలుగు రోజుల పాటు నిర్వహించనున్న స్టేట్ పోలీస్ డ్యూటీమీట్‌కు.. 'ఇగ్నైట్'గా నామకరణం చేశారు. నేటి నుంచి ఈనెల 7వ తేదీ వరకూ పోలీస్ పరేడ్ మైదానం, కల్యాణి డ్యాం పోలీస్ శిక్షణా కళాశాల వేదికగా వేడుకలు జరగనున్నాయి. ఈ సంబరాల్లో ప్రధానంగా రక్షక దళాల పోరాట పటిమ, శక్తియుక్తులు, ఆయుధసంపత్తి, సాంకేతిక నైపుణ్యాలను ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించి.. ప్రసంగించనున్నారు.
రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా జరుగుతున్న ఈ వేడుకలను.. జాతీయస్థాయి ప్రమాణాలతో నిర్వహించాలనే ఉద్దేశంతో భారీ ఏర్పాట్లు చేశారు. పోలీస్ శాఖ శక్తియుక్తులు చాటిచెప్పే విధంగా 18 విభాగాల్లో 22 పోటీలను నిర్వహించనున్నారు. అందుకోసం 13 జిల్లాల నుంచి 450 మంది పోలీస్ సిబ్బంది తిరుపతి నగరానికి తరలివచ్చారు. కల్యాణి డ్యాం పోలీస్ శిక్షణా కళాశాలలో పోటీలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కంప్యూటర్ అవగాహన, డాగ్‌స్క్వాడ్, ఫోటోగ్రఫీ, పొట్రేట్ పార్లే, ఫింగర్ ప్రింట్, ఐఓ ఫోటోగ్రఫీ తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాల నిర్వహణ కోసం ప్రత్యేకంగా 40 మంది ఐపీఎస్ అధికారులు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లన్నీ పర్యవేక్షించారు. జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో ప్రధాన కార్యక్రమాలు, ప్రత్యేక సమావేశాలు, సదస్సులు జరుగుతాయి.