తిరుమల తిరుపతి దేవస్థానంలో అర్చకత్వ బాధ్యతలను వంశపారంపర్య(మిరాశీ) అర్చకులకు మాత్రమే అప్పగించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది. వైఖానస అగమ పద్ధతుల ప్రకారం పోటీ నియమాకం ద్వారా అర్చకులను నియమించాలని కోరుతూ విశ్రాంత ఇంజనీర్ యలమంచిలి ఈశ్వరరావు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి, తితిదే కార్యనిర్వహణ అధికారిని వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చారు.
సుప్రీంకోర్టు తీర్పును పరిగణనలోకి తీసుకోకుండామిరాశీ వ్యవస్థను కొనసాగిస్తున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. 1996 మార్చిలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా మిరాశీ విధానాన్ని కొనసాగిస్తున్నారన్నారు. ఏపీ దేవాదాయ చట్టంలోని పలు సెక్షన్లు మిరాశీ వ్యవస్థను నిషేధిస్తున్నాయన్నారు. ఆ సెక్షన్లను సవాలు చేస్తూ మిరాశీ కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టు ఆశ్రయించగా వారి వ్యాజాన్ని కొట్టేసిందన్నారు.