డేటా చౌర్యం, వ్యక్తిగత వివరాలు బయటకు పొక్కడం వంటివి సామాజిక మాధ్యమాలు ఉపయోగించే వారు తరచూ ఎదుర్కొనే సమస్యలు. ఒక యాప్ ఉపయోగించడానికి మనం ఇచ్చే ఫోన్ నెంబర్, ఇతర వివరాలు ఎంతవరకు భద్రంగా ఉంటున్నాయో తెలియని పరిస్థితి. వీటికి మన దేశీయ యాప్‌తోనే పరిష్కారం చూపించే ప్రయత్నం చేస్తున్నాడు తిరుపతికి చెందిన వినయ్. 2018లో ఇంజినీరింగ్ పూర్తిచేసిన ఇతను ఆత్మనిర్భర్ భారత్‌కు మద్దతుగా మొబైల్, వెబ్ బేస్డ్ యాప్‌కు రూపకల్పన చేశాడు. 'అదే పెంజ్ బాక్స్'
వన్ స్టాప్ డెస్టినీ ఫర్ ఆల్
పెంజ్ బాక్స్.. ఇతర మొబైల్ యాప్స్‌లానే ఆండ్రాయిడ్ వెర్షన్ మొబైల్ యాప్, వెబ్ బేస్డ్ యాప్‌గా పనిచేస్తుంది. ఇందులో ఫేస్ బుక్, వాట్సాప్, మెసెంజర్ వంటి అప్లికేషన్లలో ఉండే ఫీచర్లు ఉంటాయి. 'వన్ స్టాప్ డెస్టినీ ఫర్ ఆల్' అనే టాగ్ లైన్‌తో దాదాపు 10 యాప్స్‌లలో ఉండే ఫీచర్లను ఇందులో పొందుపరిచాడు. ఫొటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం, చాటింగ్, వీడియో కాల్స్, టెంప్లేట్స్ తయారుచేసుకోవడం, కొటేషన్ మేకర్స్, కలర్ బ్యాక్‌గ్రౌండ్ థీమ్స్‌ను అందుబాటులో ఉంచాడు. ఆన్లైన్ పోల్స్‌ను నిర్వహిస్తూ ఓ అంశంపై ప్రజల అభిప్రాయలు తెలుసుకునే అవకాశాన్ని పెంజ్ బాక్సులో కల్పించాడు. ఇవన్నీ ఇతర యాప్‌లలోనూ ఉన్నా.. అన్ని ఫీచర్లు ఒకే యాప్‌లో ఉండడం పెంజ్ బాక్స్ ప్రత్యేకతగా వినయ్ చెప్తున్నాడు.
యాప్‌లోనే యూట్యూబ్ వీడియోలు
సాధారణంగా న్యూస్ ఫీడ్‌లో అన్ని రకాల పోస్టులు, వార్తలు మనకు కన్పిస్తుంటాయి. అదే పెంజ్ బాక్స్‌లో అయితే మనకు నచ్చిన వాటినే చూడొచ్చు. మరీ ముఖ్యంగా యూట్యూబర్స్‌కి మేలు చేసే విధంగా పెంజ్ బాక్సులో ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా యూట్యూబ్ వీడియో లింక్ మనం పోస్ట్ చేస్తే థంబ్నెయిల్తో లింక్ మాత్రమే పేస్ట్ అవుతుంది. ఆ వీడియోను చూడాలంటే ఆ లింకుపై క్లిక్ చేయాల్సి ఉంటుంది. కాని పెంజ్బాక్సులో నేరుగా యూట్యూబ్ వీడియో ప్లే అయ్యేలా ఆప్షన్ అందుబాటులో ఉంది. ఈ తరహా ఫీచర్ స్వదేశీ యాప్స్‌లో ఓ విప్లవాత్మకమైన మార్పుగా వినయ్ అభివర్ణిస్తున్నాడు. అలాగే గ్రూపులో సభ్యుల సంఖ్యను అపరిమితం చేస్తూ ఫీచర్ పొందుపరిచాడు.