జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఈ నెల 21న సమావేశం కానుంది. తిరుపతిలో జరిగే ఈ సమావేశంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో పాటు పీఏసీ సభ్యులు పాల్గొంటారు. తిరుపతి పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక జరగనున్న దృష్ట్యా ఈ సారి సమావేశం ఇక్కడ నిర్వహించనున్నారు. ఉప ఎన్నికలో పోటీతో పాటు రాష్ట్రంలోని రాజకీయ అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నారు.
భాజపాతో పొత్తు నేపథ్యంలో అక్కడ ఏ పార్టీ తరఫున అభ్యర్థిని నిలపాలనేది ఇంకా నిర్ణయించలేదు. మరోవైపు పోటీకి భాజపా ఉత్సాహం చూపుతోంది. ఈ తరుణంలో అక్కడ జనసేన పోటీ చేయాలా.. లేదా.. అన్నది ఈ కార్యక్రమంలో ప్రధాన ఎజెండా కానుంది. అలాగే పంచాయతీ ఎన్నికల విషయంపైనా చర్చించే అవకాశముంది.