చిత్తూరు జిల్లాలో పర్యటిస్తోన్న జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్.. ఇవాళ తిరుపతిలో న్యాయవాదులతో సమావేశమయ్యారు. న్యాయవాదులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. జనసేన పార్టీ స్థాపనకు కారణాలను న్యాయవాదులతో ఆయన పంచుకున్నారు. ఎంతో కష్టమైన సమయంలో జనసేన పార్టీ పెట్టానన్న పవన్... ఎన్నో ఎదురుదెబ్బలు ఉంటాయని తెలిసే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. రాజకీయాల్లో మార్పు తెచ్చేందుకే జనసేన కంకణం కట్టుకుందన్నారు. భావితరాల గురించి ఆలోచించే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. త్రికరణశుద్ధి ఉన్న న్యాయవాదులు రాజకీయాల్లోకి రావాలని ఆయన కోరారు. కోర్టుల వద్ద న్యాయవాదులకు సరైన మౌలిక వసతులు లేవని పవన్ అన్నారు.
రాయలసీమకు చెడ్డపేరు తెచ్చిందేవరు?
వైకాపా నేతల భాష దారుణంగా ఉందని పవన్‌కల్యాణ్ఆరోపించారు. ఏ అంశం గురించి మాట్లాడుతున్నారో అసలు అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. బాధ్యతగా ఉండాల్సిన వాళ్లే నిత్యం బూతులు మాట్లాడుతున్నారన్నారు. జగన్‌ను ముఖ్యమంత్రిగా కచ్చితంగా గుర్తించనని పవన్ వ్యాఖ్యానించారు. మాటలు రాని చెట్లను నరికేస్తున్న వారిని ఎందుకు గౌరవించాలని పవన్ ప్రశ్నించారు. రాయలసీమలో బత్తాయిచెట్లు నరికించడం ఏం మానవత్వమని పవన్ అన్నారు.
రాయలసీమ ప్రాంతానికి చెడ్డపేరు ఎవరు తెచ్చారో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. రాయలసీమను కొన్ని గ్రూపులు కబ్జా చేశాయని ఆరోపించారు. జనసేన నిజం మాట్లాడుతుంది కాబట్టే ప్రభుత్వం నుంచి స్పందన వస్తుందని పవన్ స్పష్టం చేశారు.