ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సర్వశక్తులూ ఒడ్డుతున్న తెదేపా.. గెలుపుపై వైకాపా ధీమా..! - CBN in Tirupathi By-poll campaign

పోలింగ్‌ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో పార్టీలు ప్రచారాస్త్రాలకు పదును పెడుతున్నాయి. సిట్టింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకోవాలని వైకాపా పట్టుదలగా ఉంది. ప్రత్యేక హోదా తేవడంలో వైకాపా వైఫల్యం, వివేకానందరెడ్డి హత్య కేసుల్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ.. వైకాపాను ఇరుకున పెట్టేందుకు తెదేపా ప్రయత్నిస్తోంది. జనసేనతో కలసి పోటీ చేస్తున్న భాజపా.. తిరుపతిలో సత్తా చాటగలమని ఆశిస్తోంది.

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక

By

Published : Apr 11, 2021, 7:24 AM IST

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక పోలింగ్‌ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ప్రధాన పార్టీలు ప్రచారాస్త్రాలకు మరింత పదును పెడుతున్నాయి. సిట్టింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకోవాలని వైకాపా పట్టుదలగా ఉంది. తమ అభ్యర్థి గురుమూర్తి గెలుపు నల్లేరు మీద నడకేనని, ఐదు లక్షలకుపైగా మెజార్టీ సాధించడమే లక్ష్యమని వైకాపా నేతలు చెబుతున్నారు. నవరత్నాలు, సంక్షేమ పథకాల్నే ఆ పార్టీ ప్రధాన ప్రచారాంశాలుగా చేసుకుంది.

వైకాపా కంటే చాలా ముందే.. కేంద్ర మాజీమంత్రి పనబాక లక్ష్మిని తమ అభ్యర్థిగా ప్రకటించిన తెదేపా... అప్పటి నుంచే వ్యూహరచన మొదలు పెట్టింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడితో పాటు మాజీమంత్రులు, సీనియర్‌ నేతల్ని శాసనసభ నియోజకవర్గాలకు, క్లస్టర్లకు ఇన్‌ఛార్జులుగా నియమించింది. పార్టీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ విస్తృత ప్రచారం చేస్తున్నారు. ప్రత్యేక హోదా తేవడంలో వైకాపా వైఫల్యం, వివేకానందరెడ్డి హత్య కేసుల్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ వైకాపాను ఇరుకున పెట్టేందుకు తెదేపా ప్రయత్నిస్తోంది.

జనసేనతో కలసి పోటీ చేస్తున్న భాజపా.. తిరుపతిలో సత్తా చాటగలమని ఆశిస్తోంది. పార్టీ అభ్యర్థి, విశ్రాంత ఐఏఎస్‌ అధికారిణి రత్నప్రభ తరపున ప్రచారానికి దిల్లీ నుంచి పార్టీ జాతీయ నాయకులూ రంగంలోకి దిగుతున్నారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఇప్పటికే ఒకసారి ప్రచారం చేశారు.

పార్టీల బలాబలాలు ఇలా ఉన్నాయి..

వైకాపా బలాలు..

* ప్రభుత్వ సంక్షేమ పథకాలు

* అధికార పార్టీకి సహజంగా ఉండే సౌలభ్యాలు. అర్థ, అంగ బలాలు

* 2014, 2019 ఎన్నికల్లో తిరుపతి లోక్‌సభ స్థానాన్ని వైకాపానే గెలుచుకోవడం

* తిరుపతి నగరపాలక సంస్థను, ఇతర మున్సిపాలిటీలను గెలవడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం

* మంత్రుల్ని, ఇతర సీనియర్‌ నాయకుల్ని మోహరించడం

బలహీనతలు

* పార్టీ అభ్యర్థి రాజకీయాలకు పూర్తిగా కొత్త ముఖం కావడం

* అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఈ ప్రాంతానికి కొత్త పరిశ్రమలేవీ తీసుకురాలేకపోవడం, నిరుద్యోగం

* పుణ్యక్షేత్రం తిరుమల కేంద్రంగా ముసురుకున్న వివాదాలు

తెదేపా బలాలు..

* గత ఎన్నికల్లో పోటీ చేసిన పనబాక లక్ష్మి మళ్లీ అభ్యర్థి కావడం. అప్పుడు ఓడిపోయారన్న సానుభూతి

* కేంద్ర మాజీ మంత్రిగా, సీనియర్‌ నేతగా ఆమెకు ఉన్న ప్రాచుర్యం

* తెదేపా అధినేత చంద్రబాబు ప్రచారబరిలోకి దిగడం, క్షేత్రస్థాయి వరకు వెళ్లేలా పటిష్ఠమైన ప్రచార వ్యూహం

* తెదేపా హయాంలో హీరో మోటార్స్‌, అపోలో టైర్స్‌ వంటి పరిశ్రమలతో పాటు పలు సెల్‌ఫోన్‌ తయారీ కంపెనీలను తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఉపాధి కల్పించడం.

బలహీనతలు...

* అధికార పార్టీకి ఉన్న అర్థబలం లేకపోవడం.

* నగరపాలక, పురపాలక సంస్థల ఎన్నికల్లో పరాజయంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం తగ్గడం.

* అధికార పార్టీ కేసులు పెడుతుందేమోనన్న భయంతో నాయకులు దూరంగా ఉండటం

* స్థానిక నాయకుల మధ్య సమన్వయలోపం

భాజపా బలాలు

* భాజపా, జనసేన కలసి పోటీ చేయడం.

* జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ఉన్న సినీ గ్లామర్‌, యువతలో ఉన్న ఆదరణ

* భాజపా కేంద్ర నాయకత్వం ఈ స్థానంపై ప్రత్యేక దృష్టి పెట్టడం

బలహీనతలు...

* కేడర్‌ బలం పెద్దగా లేకపోవడం

* క్షేత్రస్థాయిలో భాజపా, జనసేన శ్రేణుల మధ్య అంత సఖ్యత లేకపోవడం

* ప్రత్యేక హోదా సహా విభజన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని భాజపాపై ప్రజల్లో ఉన్న కోపం

కాంగ్రెస్‌...

తిరుపతి లోక్‌సభ స్థానం నుంచి ఆరుసార్లు గెలిచి, కేంద్ర మంత్రిగా పనిచేసిన చింతామోహన్‌ మరోసారి రంగంలోకి దిగారు. 2014, 2019 ఎన్నికల్లో ఆయనకు డిపాజిట్‌ దక్కలేదు. ఈసారి ఉనికి చాటాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు.

శాసనసభ నియోజకవర్గాల్లో ఇదీ పరిస్థితి...

  • తిరుపతి...

2019 సాధారణ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి కరుణాకర్‌రెడ్డిని 708 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో ఎమ్మెల్యేగా గెలిపించిన ఓటర్లు.. లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం తెదేపా అభ్యర్థి పనబాక లక్ష్మికి 3,578 మెజార్టీ కట్టబెట్టారు. ఈసారి మరింత కష్టపడితే మెజార్టీని ఇంకా పెంచుకోగలమన్న నమ్మకంతో తెదేపా ఉంది. తిరుపతిలో ప్రస్తుతం తమ బలం బాగా పెరిగిందని, పురపాలక ఎన్నికల్లో ఘన విజయమే దానికి నిదర్శనమని వైకాపా భావిస్తోంది. ఆధ్యాత్మిక క్షేత్రం కావడం, జనసేనతో కలసి పోటీ చేయడం తిరుపతిలో కలిసివస్తాయని భాజపా విశ్వసిస్తోంది.

  • శ్రీకాళహస్తి..

2019 ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి బియ్యపు మధుసూదన్‌రెడ్డి 35,400 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. వైకాపాలోకి కొత్తగా వచ్చిన నాయకులకూ, పాతవారికీ పొసగకపోవడం వంటివి పార్టీకి ప్రతికూలాంశాలు. పార్టీ సీనియర్‌ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అనారోగ్యంతో క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండటంతో తెదేపాకి నాయకత్వ లోపం ఏర్పడింది. అధికార పార్టీ నాయకులు.. ఎర్రచందనం, అక్రమ మద్యం కేసులు పెట్టి జైళ్లకు పంపుతారన్న భయంతో తెదేపా నాయకుల్లో కొందరు క్రియాశీలంగా లేకపోవడమూ ప్రతికూలాంశమే.

  • సత్యవేడు...

తెదేపాకు గట్టి పట్టుంది. 2009, 2014 ఎన్నికల్లో తెదేపా అభ్యర్థులే గెలిచారు. 2019లో మాత్రం వైకాపా అభ్యర్థి కె.ఆదిమూలం 44,744 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. గత రెండేళ్లలో నియోజకవర్గానికి పెద్దగా పరిశ్రమలేవీ రాకపోవడం, అభివృద్ధి లేకపోవడం వైకాపాకు ప్రతికూలాంశాలు. తెదేపాకు నాయకత్వం లేదు. స్థానిక నాయకుల మధ్య సమన్వయమూ కరవే. సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు ఇటీవల నియోజకవర్గ నాయకుల్ని సమావేశపరిచి, విభేదాల్ని చక్కదిద్దే ప్రయత్నం చేశారు.

  • సర్వేపల్లి...

2014, 2019 ఎన్నికల్లో వైకాపా ఎమ్మెల్యేగా కాకాణి గోవర్థన్‌రెడ్డి గెలిచారు. ప్రస్తుత ఎన్నికల్లోనూ వైకాపా ప్రచార బాధ్యతను ఆయనే భుజానికెత్తుకున్నారు. పార్టీ బలంగా ఉంది. తెదేపా సీనియర్‌ నేత, నియోజకవర్గ ఇన్‌ఛార్జి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ద్వితీయశ్రేణి నాయకత్వంలో కొందరు దూరమైనా, బలమైన కేడర్‌ ఉండటం తెదేపాకు సానుకూలాంశం.

  • సూళ్లూరుపేట...

వైకాపాకు బలమైన నాయకత్వం ఉంది. స్థానిక ఎమ్మెల్యేపై కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ.. నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉంది. తెదేపాకు ఇక్కడ నాయకత్వ లోపం సమస్య. ఇటీవలే నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా నియమితుడైన నెలవల సుబ్రహ్మణ్యం.. పార్టీ నాయకుల్ని ఏకతాటిపైకి తేవడంలో కొంత సఫలీకృతులయ్యారు. కేడర్‌లోనూ విశ్వాసం పెరిగింది.

  • వెంకటగిరి...

గత ఎన్నికల్లో సీనియర్‌ నేత, వైకాపా అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డి గెలుపొందారు. ఆయన వైకాపా శంఖారావం పేరుతో మండలాల వారీగా విస్తృత ప్రచారం చేస్తున్నారు. 2019లో ఓడినా తెదేపాకు ఇప్పటికీ బలమైన నాయకత్వం, కేడర్‌ ఉన్నాయి. తెదేపా నాయకులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

  • గూడూరు...

2014లో తిరుపతి ఎంపీగా గెలిచిన వరప్రసాద్‌.. ప్రస్తుతం ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనపై పార్టీ కేడర్‌లో కొంత అసంతృప్తి ఉంది. వైకాపాలో గ్రూప్‌ రాజకీయాలు నష్టం చేస్తున్నాయి. తెదేపా అభ్యర్థి పనబాక లక్ష్మి భర్త కృష్ణయ్యది గూడూరు నియోజకవర్గంలోని వెంకన్నపాలెం గ్రామం కావడంతో స్థానికంగా వారికి కొంత పట్టుంది. కేంద్రమంత్రిగా పనబాక లక్ష్మి ఇక్కడ 30 పడకల ఆస్పత్రి నిర్మాణం వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఇవి తెదేపాకు కొంత కలసిరావచ్చు.

నియోజకవర్గ స్వరూపం ఇలా...

* తిరుపతి పరిధిలోని అసెంబ్లీ స్థానాలు: చిత్తూరు, శ్రీకాళహస్తి, సత్యవేడు (చిత్తూరు జిల్లా) గూడూరు, సర్వేపల్లి, వెంకటగిరి, సూళ్లూరుపేట (నెల్లూరు జిల్లా)

* ఓటర్లు: సుమారు 17.07 లక్షలు. వీరిలో పట్టణ ఓటర్లు దాదాపు 5 లక్షలు.

* చింతామోహన్‌ ఇక్కడి నుంచి ఆరుసార్లు గెలుపొందారు. కేంద్ర మంత్రిగానూ పనిచేశారు.

* తిరుపతి లోక్‌సభ స్థానం ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట. 1952 నుంచి ఇప్పటి వరకు 16సార్లు ఎన్నికలు జరిగితే ఐదుసార్లు కాంగ్రెస్‌, ఏడుసార్లు కాంగ్రెస్‌ (ఐ) గెలుపొందాయి. వైకాపా రెండుసార్లు, తెదేపా, భాజపా ఒక్కోసారి నెగ్గాయి.

* 1952లో ఇక్కడి నుంచి గెలిచిన ఎం.అనంతశయనం అయ్యంగార్‌ లోక్‌సభ స్పీకర్‌గా పనిచేశారు.

ABOUT THE AUTHOR

...view details