తెదేపా అభ్యర్థిగా పనబాక లక్ష్మి నామినేషన్ దాఖలు తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలకు నామినేషన్ దాఖలైంది. తెదేపా అభ్యర్థి పనబాక లక్ష్మి నెల్లూరు కలక్టరేట్లో అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. నగరంలోని తెదేపా కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి, వీఆర్సీ సెంటర్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన పార్టీ నేతలు.... అక్కడ నుంచి ర్యాలీగా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, యనమల రామకృష్ణుడుతోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
రాష్ట్రాన్ని అవినీతిమయం చేశారు: తెదేపా
ఈ సందర్భంగా వైకాపా ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై తెదేపా నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 22 మంది ఎంపీలున్న... రాష్ట్ర సమస్యల గురించి పార్లమెంట్లో మాట్లాడలేని దుస్థితి నెలకొందని వారు విమర్శించారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్ష కోట్లు దోచేసిన జగన్, ఇప్పుడు ఒక్క అవకాశమంటూ అధికారం చేపట్టి రాష్ట్రాన్నే అవినీతిమయం చేశారని దుయ్యబట్టారు. తెలుగుదేశం పార్టీకి ముగ్గురు ఎంపీలున్న సింహాల్లా పోరాడుతున్నారని కొనియాడారు. పనబాక లక్ష్మిని గెలిపిస్తే రాష్ట్ర సమస్యలపై గళమెత్తేందుకు మరింత అవకాశం ఉంటుందన్నారు. పనిచేసే లక్ష్మిగా పేరు పెట్టిన ప్రజలు, తనను గెలిపించాలని అభ్యర్థి పనబాక లక్ష్మి కోరారు.
ఇదీ చదవండి:
తిరుపతి ఉపఎన్నికకు నేడు తెదేపా అభ్యర్థి నామినేషన్.. నెల్లూరుకు పార్టీ నేతలు