ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అన్యమతస్థులకు శ్రీవారి దర్శనం.. డిక్లరేషన్​పై దుమారం!

అన్య మతస్థులు శ్రీవారిని దర్శించుకునేందుకు ఎలాంటి డిక్లరేషన్ ఇవ్వాల్సిన ఆవసరం లేదని తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. అనాదిగా వస్తున్న నిబంధనలను పక్కన పెట్టాలని నిర్ణయించడంపై రాజకీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నిబంధన ఈనాటిది కాదని.. ఎన్నో ఏళ్లుగా తితిదేలో కొనసాగుతోందని ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఈవోగా పని చేసిన ఐవైఆర్ కృష్ణారావు ఇప్పటికే ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడించారు. మరోవైపు.. వైవీ సుబ్బారెడ్డి తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు.

pagans-the-declaration-issue
తితదేలో డిక్లరేషన్ పై దుమారం

By

Published : Sep 20, 2020, 7:10 AM IST

శ్రీవారిని దర్శించుకునేందుకు ముందుగా డిక్లరేషన్ ఫారంపై సంతకం చేసే సంప్రదాయం బ్రిటీష్ కాలం నుంచే అమల్లో ఉన్నట్లు తితిదై ఈవోలుగా చేసి పదవీ విరలణ పొందిన కొందరు అధికారులు పేర్కొంటున్నారు. 1933లో తితిదేకు ప్రత్యేకంగా ఒక కమిషనర్ ను నియమించారు. అప్పటి వరకూ మహంతుల పర్యవేక్షణలోనే తితిదే వ్యవహారాలు సాగేవి. ఆ సమయంలో ఇతర మతాలకు చెందిన వ్యక్తులు స్వామివారిని దర్శించుకునేందుదు వస్తే డిక్లరేషన్ ఇచ్చేవారని పేర్కొంటున్నారు. అప్పట్లో బ్రిటీష్ వారు తితిదే ఆలయం జోలికి రాలేదని అంటున్నారు.

ఇదీ డిక్లరేషన్

తితిదే ఆలయాల్లోకి అన్యమతస్థులు ప్రవేశించే ముందు డిక్లరేషన్ ఇవ్వాలంటూ 1990 ఏప్రిల్ 11న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ అంశాన్ని ఛాప్టర్ 18లో పొందుపర్చారు. ఇతర మతస్థులు తితిదే ఆలయాల్లోని దేవుళ్లను దర్శిుచకునేందుకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఇందుకోసం డిక్లరేషన్ సమర్పించాలని నోటిపికేషన్ లో స్పష్టంగా పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఒక ఫారాన్ని తయారు చేశారు. తితిదేలోని 136వ నిబంధనను అనుసరించి రూపొందించారు. స్వామి దర్శనానికి వెళ్లే అన్యమతస్థులు తమ పేరు, మతాన్ని పేర్కొంటూ శ్రీవెంకటేశ్వరస్వామిపై తనకు నమ్మకం, గౌరవం ఉందని అందువల్ల దర్శనానికి అనుమతించాల్సిందిగా పేర్కొంటూ డిక్లరేషన్ పై సంతకం చేయాల్సి ఉంది. ఈ డిక్లరేషన్ ను తితిదేలోని పేష్కార్ కు కానీ ఇతర ఆలయాల్లో ఆలయ ఇన్ ఛార్జిగా ఉన్న వ్యక్తికి ఇవ్వాల్సి ఉందని అందులో వివరించారు. దానికి ఆమోదం లభించాక ఇతర భక్తుల తరహాలోనే స్వామిని దర్శించుకోవచ్చని పేర్కొన్నారు. అప్పటి రాష్ట్రపతిగా ఉన్న అబ్దుల్ కలాం తిరుమల సందర్శన సందర్భంగా డిక్లరేషన్ పై సంతకం చేశారు.

ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వివరణ

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే అన్య మతస్థులు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని చేసిన ప్రకటనపై తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వివరణ ఇచ్చారు. శ్రీవారి దర్శనానికి వచ్చిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్వామివారికి డిక్లరేషన్ ఇవ్వలేదని చెప్పానని.. తీసేయాలని చెప్పలేదని తెలిపారు. శనివారం సాయంత్రం శ్రీవారి ఆలయంలో ధ్వజారోహణంలో పాల్గొన్న అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. శ్రీవారి దర్శనానికి రోజూ వేల మంది భక్తులు వస్తుంటారు. అందులో వివిధ మతాలకు చెందినవారు ఉంటారు. వారందరిని డిక్లరేషన్ తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనని అడగలేం కదా.. అని మాత్రమే తాను మాట్లాడనన్నారు.

అన్య మతస్థులు స్వచ్ఛందంగా డిక్లరేషన్ ఇవ్వాలి

తితిదే చట్టంలోని రూల్ నెం 136 ప్రకారం హిందువులు మాత్రమే శ్రీవారి దర్శనానికి అర్హులని.. ఇతర మతస్థులు తాము హిందూయేతరులమని దేవస్థానం అధికారులకు చెప్పి డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందని రూల్ నెం. 137లో స్పష్టంగా ఉందని ఛైర్మన్ తెలిపారు. 2014లో ప్రభుత్వం జారీ చేసిన మెమో ప్రకారం ఎవరైనా గుర్తించదగిన ఆధారాలు ఉన్నవారైతే ముస్లిం, క్రైస్తవుల పేర్లు, ఆహార్యం ఉంటే దేవస్థానం అధికారులే డిక్లరేషన్ అడుగుతారని చెప్పారు. గతంలో అనేక మంది ఇతర మతాల ప్రముఖులలు దర్శనానికి వచ్చిన సందర్భంలో డిక్లరేషన్ ఇవ్వలేదని తెలిపారు. సీఎం జగన్ మోహన్ రెడ్డిని బ్రహ్మోత్సవాలకు తితిదే ఆహ్వానించిందని, రాష్ట్ర ప్రజల తరుపున ఆయన శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని.. స్వామివారిపై ముఖ్యమంత్రికి అపార భక్తి విశ్వాసాలు ఉన్నాయని.. ఆయనను డిక్లరేషన్ అడగాల్సిన అవసరం లేదని చెప్పానని అన్నారు. డిక్లరేషన్ తీసేయాలని చెప్పలేదని పేర్కొన్నారు.

ఇవీ చూడండి:

3 రాజధానులు నమ్మకద్రోహమే: పవన్ కల్యాణ్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details