ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 10, 2021, 9:17 AM IST

ETV Bharat / city

ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్‌ ఉత్పత్తి

రాష్ట్రంలో ఆక్సిజన్​ కొరత నుంచి బయటపడటానికి చర్యలు చేపట్టారు. ప్రభుత్వాసుపత్రుల్లోనే ఆక్సిజన్‌ ఉత్పత్తి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. విశాఖ, కాకినాడల్లో ఇప్పటికే కేంద్రాలు ఏర్పాటు చేశారు. కర్నూలు, గుంటూరు, తిరుపతిల్లో కేంద్రాల ఏర్పాటుకు పనులు కొనసాగుతున్నాయి.

oxygen production in government hospitals in andhra pradesh
oxygen production in government hospitals in andhra pradesh

ప్రభుత్వాసుపత్రుల్లోనే ఆక్సిజన్‌ ఉత్పత్తి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. గాలిలో నుంచి సేకరించిన ఆక్సిజన్‌ను ద్రవ రూపంలోకి మార్చి బాధితులకు అందించేందుకు వీలుగా తొలి దశలో రాష్ట్రంలో 5చోట్ల ప్రెజర్‌స్వింగ్‌ అడాప్షన్‌ (పీఎస్‌ఏ) కేంద్రాల ఏర్పాటుకు కేంద్రం గత అక్టోబరులో ఆమోదం తెలిపింది. దీని ప్రకారం విశాఖ కేజీహెచ్‌, కాకినాడ జీజీహెచ్‌లలో కేంద్రాలను ఏర్పాటుచేశారు. కర్నూలు, గుంటూరు, తిరుపతి ప్రభుత్వాసుపత్రుల్లో వీటి ఏర్పాటు ప్రయత్నాలు వివిధ దశల్లో ఉన్నాయి. ఈ క్రమంలోనే కేంద్రం అదనంగా మరికొన్ని పీఎస్‌ఏ కేంద్రాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఒక్కొక్క కేంద్రం ద్వారా నిమిషానికి వెయ్యి లీటర్ల నుంచి 2వేల లీటర్ల ఆక్సిజన్‌ ఉత్పత్తవుతుంది.

గ్రామాల నుంచి పట్టణాల వరకు


బోధనాసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, సామాజిక, ప్రాంతీయ ఆసుపత్రుల్లో ఈ కేంద్రాలు రానున్నాయి. ప్రభుత్వాసుపత్రుల్లో ఉన్న ప్లాంట్లలో గుత్తేదారు నింపుతున్న ప్రాణవాయువు అడుగంటేలోపు ఆక్సిజన్‌ ట్యాంకర్లు వస్తాయో, రావోననే ఆందోళన ఎప్పటికీ ఉంటోంది. ఆసుపత్రుల్లోనే పీఎస్‌ఏ కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా ట్యాంకర్ల సరఫరాలో కాస్త జాప్యమేర్పడినా బాధితుల సంఖ్యను బట్టి 4,5 గంటల వరకు ఆక్సిజన్‌ అందించేందుకు వీలుంటుంది. వైద్య ఆరోగ్య శాఖ సొంత నిధులతో ఏర్పాటు చేసే 13 పీఎస్‌ఏలు ఒంగోలు, నెల్లూరు, ఇతర చోట్ల రానున్నాయి. తెనాలి జిల్లా ఆసుపత్రుల్లో దీని ఏర్పాటుకు నేషనల్‌ హైవే అథారిటీ అధికారులు స్థలాన్ని పరిశీలించారు. తక్కువ స్థలంలో వీటి ఏర్పాటుకు వీలుంది. పెట్టుబడి ఎక్కువే అయినప్పటికీ.. నిర్వహణ ఖర్చులు తక్కువ. విద్యుత్‌ వినియోగ ఛార్జీలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. సిలిండర్లు, రీఫిలింగ్‌, లోడింగ్‌, అన్‌లోడింగ్‌ భారం ఉండదు.

పడకలు, స్థలాన్ని బట్టి పీఎస్‌ఏ సామర్థ్యం

నిమిషానికి 200 లీటర్ల ఆక్సిజన్‌ అందించే 7 పీఏస్‌ఏలు, 500 లీటర్ల ఆక్సిజన్‌ అందించేవి ఆరు (ఆదోని, మార్కాపురం, ఇతర జిల్లా ఆసుపత్రులు), వెయ్యి లీటర్ల ఆక్సిజన్‌ సామర్థ్యమున్న పీఎస్‌ఏలను 27 చోట్ల రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నాం. మిగిలిన వాటిల్లో నిమిషానికి 2వేల లీటర్ల ఆక్సిజన్‌ సామర్థ్యమున్నవి ఉన్నాయి. వెయ్యి లీటర్లు అందించే పీఎస్‌ఏ కేంద్రం ఏర్పాటుకు రూ.1.5 కోట్లు, 2,000 లీటర్ల ఆక్సిజన్‌ అందించే కేంద్రం ఏర్పాటుకు రూ.3 కోట్లు ఖర్చవుతుంది. ఆసుపత్రుల్లో పడకలు, స్థలం అందుబాటును బట్టి ఈ కేంద్రాల సామర్థ్యాన్ని ఖరారు చేశాం. వచ్చే 3 నెలల్లో వీటిని ఏర్పాటు చేయాలనేది లక్ష్యం.- విజయరామరాజు, ఎండీ, రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ

ఇదీ చదవండి: రాష్ట్రంలో నేటి నుంచి ఈ పాస్​ విధానం అమలు: డీజీపీ

ABOUT THE AUTHOR

...view details