Railways One Station-One Product scheme: కేంద్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా చేపట్టనున్న వన్ స్టేషన్- వన్ ప్రొడక్ట్ పథకం కోసం దక్షిణ మధ్య రైల్వేలో తిరుపతి రైల్వేస్టేషన్‌ను ఎంపిక చేశారు. నేటి నుంటి (ఈ నెల 25 నుంచి) పదిహేను రోజుల పాటు స్థానిక ఉత్పత్తుల అమ్మకానికి వీలుగా స్టేషన్‌లో ప్రత్యేకంగా విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధికెక్కిన హస్తకళలు, స్థానిక ఉత్పత్తులను కళాకారులు విక్రయించుకొనేందుకు స్టేషన్‌లో అవకాశం కల్పిస్తారు. స్థానిక ఆహార పదార్థాలు, వాయిద్య సాధనాలు వంటివి కూడా విక్రయించనున్నారు.
స్థానిక హస్తకళలను జాతీయస్థాయిల గుర్తింపే లక్ష్యంగా: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల శ్రీవారి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులతో తిరుపతి స్టేషన్ నిత్యం రద్దీగా ఉంటుంది. తిరుపతి సమీపంలోని శ్రీకాళహస్తి కళంకారీ కళకు ప్రసిద్ధి చెందింది. అక్కడ తయారయ్యే కళంకారీ చీరలు, పెయింటింగులు తిరుపతి స్టేషన్‌లో విక్రయించనున్నారు. స్థానిక హస్తకళలను జాతీయ స్థాయిలో గుర్తింపు కల్పించడం.. కళాకారుల నైపుణ్యాన్ని వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ వన్ స్టేషన్- వన్ ప్రొడక్ట్ పథకాన్ని అమలు చేయనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.