రాష్ట్రవ్యాప్తంగా శైవక్షేత్రాల్లో రెండోరోజు కార్తిక సందడి నెలకొంది. కార్తిక మాసంలో రెండో తిథి కార్తిక శుద్ధ విదియ(యమ ద్వితీయ) పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచే శివాలయాల్లో భక్తుల బారులు తీరారు. ఆలయాల ప్రాంగణాల్లో దీపాలు వెలిగిస్తున్నారు.
శ్రీశైలం మహాక్షేత్రంలో...
శ్రీశైల మహాక్షేత్రంలో కార్తిక మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల తొలిరోజు రాత్రి ఆలయ ప్రాంగణంలో సంప్రదాయబధ్ధంగా ఆకాశ దీపాన్ని అర్చకులు వెలిగించారు. దేవస్థానం ఈవో ఎస్. లవన్న ఆకాశ దీపానికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. భక్తుల శివనామ స్మరణల మధ్య ఆకాశ దీపాన్ని ఆలయ ప్రధాన ధ్వజస్తంభంపై అమర్చారు. కార్తిక మాసంలో ప్రతి ఆలయంలో ఆకాశ దీపం వెలిగించడం సంప్రదాయం. ఆకాశ దీపాన్ని దర్శిస్తే సకల పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. శ్రీశైలంలో భక్తులు పెద్ద ఎత్తున కార్తిక దీపారాధనలు నిర్వహించుకుంటున్నారు.
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ..
కార్తిక మాసం పురస్కరించుకొని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఆగమోక్తంగా ఆకాశ దీపోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్తిక మాసం ప్రారంభం సందర్భంగా విశేష ఉత్సవాన్ని వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య జరిపారు. ఆలయ ఈవో పెద్దిరాజు దంపతులు ఆకాశ దీపాన్ని వెలిగించి శాస్త్రోక్తంగా దీపపు స్తంభం మీదకు అధిరోహించారు. ఈ మాసం మొత్తం ఆకాశ దీపోత్సవం జరుపుతున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.