NTR Trust Ex-Gratia For Flood Victims: వరదలతో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు.. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ఆర్థికసాయం ప్రకటించారు. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల పరిధిలో.. 49 మంది మృతుల కుటుంబాలకు తిరుపతిలోని ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యాలయంలో రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం అందజేశారు. భావజాలాలు వేరైనా విపత్తుల సమయంలో అందరూ సహాయం చేయాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు.
ఆపద సమయంలో తాత్కాలికంగా ఆర్థిక బాధలు ఉండకూడదనే ఉద్దేశంతోనే వరద బాధిత కుటుంబాలకు ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి సహాయం అందించామన్నారు. సమాజానికి న్యాయం చేయాలని.. నిరుపేదలను ఆదుకోవడమే లక్ష్యంగా ఎన్టీఆర్ తన జీవితాన్ని అంకితం చేశారని భువనేశ్వరి చెప్పారు. ఎంత ఎత్తుకు ఎదిగినా తన మూలాలు మరవని వ్యక్తి ఎన్టీఆర్ అని, ఆయన వారసత్వాన్ని తమ ట్రస్ట్ ముందుకు తీసుకెళ్తోందని అన్నారు. దేశం గొప్ప విజయాలు సాధించడానికి ఉపయోగపడేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. తప్పులు చేసి పాపాత్ములుగా మిగలకూడదని.. ఎల్లప్పుడూ దయ కలిగి ఇతరులకు సాయపడదామని భువనేశ్వరి పిలుపునిచ్చారు.