ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో ఎడతెగని వర్షం... ఈదురుగాలుల బీభత్సం... - నివర్ తుఫాన్ న్యూస్

నివర్‌ తుపాను ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు, నెల్లూరు, కడప, గుంటూరు, ప్రకాశం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఏకధాటిగా భారీ వర్షం కురుస్తోంది. ఈ వర్షాలతో లోతట్టుప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. జిల్లాల్లోని వాగులు, వంకలు పొంగుతున్నాయి. ఈదురు గాలులతో కూడిన వర్షానికి పలుచోట్ల చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి.

nivar
nivar

By

Published : Nov 26, 2020, 5:46 PM IST

Updated : Nov 26, 2020, 5:55 PM IST

రాష్ట్రంలో ఎడతెగని వర్షం

నివర్ తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు వాగులు, వంకలు పొంగుతున్నాయి. అధికారులు అప్రమత్తమై ప్రజలను పలుచోట్ల సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చేతికొచ్చిన పంటలు వర్షానికి తడిసిముద్దయ్యాయని రైతులు ఆవేదన చెందుతున్నారు.

తిరుమలలో వర్ష బీభత్సం..

తిరుమలలో నివర్‌ తుపాను ప్రభావం అధికంగా ఉంది. బుధవారం నుంచి వర్షం ఏకధాటిగా కురుస్తోంది. ఈదురుగాలులతో పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. దీంతో తిరుమలకు వస్తున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అప్రమత్తమైన అధికారులు దారికి అడ్డంగా పడిన చెట్లు తొలగిస్తున్నారు. తుపాను కారణంగా తిరుపతికి పలు విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ మేరకు ప్రయాణికులకు విమానయాన సంస్థలు సందేశాలు పంపాయి. తుపాను దృష్ట్యా చిత్తూరు జిల్లాలో అధికారులు అప్రమత్తమయ్యారు. తూర్పు ప్రాంతాల్లో ప్రభావం ఉంటుందన్న అంచనాతో అధికారులు చర్యలు చేపట్టారు. సత్యవేడు నియోజకవర్గ పరిధిలోని 340 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం మండలంలో పుల్లూరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పుల్లూరు క్రాస్‌ నుంచి సుమారు 20 గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. భారీ స్థాయిలో వర్షాలు కురుస్తుండటంతో కపిలతీర్థం జలపాతంలో నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.

చిత్తూరు జిల్లాలో

తిరుపతిలోని శ్రీరామ్‌నగర్‌లో ఇళ్లలోకి వరదనీరు చేరింది. కపిలతీర్థంలో కాల్వను ఆనుకొని ఉన్న కాలనీల్లోకి వరద నీరు చేరింది. తిరుపతి అర్బన్ శ్రీనివాసం 11 కేవీ ఉపకేంద్రం పరిధిలో బుధవారం రాత్రి 12.15 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలో వందల ఎకరాల్లో వరి పంట నీటమునిగింది. కమలాపురంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రోడ్లపైకి నీరు చేరిపోయింది. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రేణిగుంట- కడప జాతీయ రహదారిపై కడప జిల్లా సరిహద్దులో రోడ్లు దెబ్బతిన్నాయి.

నెల్లూరు జిల్లాలో..

నివర్‌ తుపాను ప్రభావంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. ఏకధాటిగా కురుస్తున్న వానకు ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరింది. వందల ఎకరాల్లో పంట నీట మునిగింది. దీంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. పలు చోట్ల ప్రధాన రహదారులన్నీ కోతకు గురయ్యాయి. మరోవైపు తీరప్రాంతంలో గాలులకు పలుచోట్ల చెట్లు నేలకూలాయి. డైకస్‌ రోడ్డు నుంచి రామకోటయ్యనగర్‌ వరకు రహదారులపై చెట్లు కూలాయి. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

జిల్లాలోని సోమశిల జలాశయం 75 టీఎంసీల పూర్తి సామర్థ్యంతో నిండింది. జలాశయానికి ఎగువ నుంచి 13 వేల క్యూసెక్కుల వరదనీరు వస్తుండగా.. 45 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పెన్నా పరివాహక ప్రాంతాల్లోని పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. నెల్లూరుతో పాటు గూడూరు, నాయుడుపేటలో భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి పలుచోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షం నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను ముందస్తుగా పునరావాస కేంద్రాల్లోకి తరలించారు. సుమారు 100 పునరావాస కేంద్రాల్లో రెండు వేల మందికి వసతి కల్పిస్తున్నారు.

కైవల్య నది ఉద్ధృతికి పలు వంతెనలను నీటి ప్రవాహం ముంచెత్తింది. దీంతో డక్కిలి, బాలాయపల్లి మండలాల్లో వంతెనలపై నీటిప్రవాహం వల్ల పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కలిగిరి మండలంలో చిన్నఅన్నలూరు, క్రాకుటూరు చెరువులు ప్రమాదకరస్థితిలో ఉన్నాయి.

నివర్ తుపాన్ ధాటికి ఆత్మకూరు నియోజకవర్గం అతలాకుతలమైంది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాల వల్ల గ్రామాల్లోని వాగులు, వంకలు పొర్లి ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఆత్మకూరులోని బీసీ కాలనీలోకి భారీగా నీరు వచ్చి చేరటంతో మున్సిపల్ అధికారులు కృషి చేసి సమస్యను పరిష్కరించారు. ఎస్​టీ కాలనీలో ఇళ్లలోకి వరద నీరు రావటంతో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

కడప జిల్లాలో

కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో నివర్ తుపాన్ ప్రభావం కొనసాగుతోంది. తిరుపతి ప్రధాన రహదారి కుక్కలదొడ్డి సమీపంలో కొండలపై నుంచి వర్షపు నీరు.. ప్రధాన రహదారిపైకి రావటంతో రోడ్డు కోతకు గురై.. తిరుపతి, కడప వెళ్లాల్సిన వాహనాలు నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. నియోజకవర్గం అంతటా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. పండ్ల తోటల రైతులు మాత్రం ఆందోళనకు గురవుతున్నారు.

జిల్లా వ్యాప్తంగా బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బద్వేలులోని భగత్ సింగ్ కాలనీ నీట మునిగింది. నాగుల చెరువు నుంచి భారీగా వరద నీరు కాలనీని చుట్టుముట్టింది. దీంతో 257 ఇళ్లు నీట మునిగాయి. స్థానికులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఆర్టీసీ గ్యారేజ్​లోకి వర్షపు నీరు చేరటం.. బస్సులు మరమ్మతులు నిలిచిపోయాయి. జమ్మలమడుగు నియోజకవర్గంలోని జమ్మలమడుగు, మైలవరం, పెద్దముడియం, ముద్దనూరు, కొండాపురం, ఎర్రగుంట్ల మండలాల్లో తెల్లవారు జామున మూడు గంటల నుంచి జోరుగా వాన కురుస్తోంది. పెన్నా, కుందు నది పరివాహక ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేశామన్నారు. గండికోట, మైలవరం జలాశయం పరివాహక ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

గుంటూరు జిల్లాలో

గుంటూరు జిల్లా వ్యాప్తంగా బుధవారం రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. అత్యధికంగా నూజండ్ల 17.6, దుగ్గిరాల 16.4, రేపల్లె 15.4, అమరావతి, నిజాంపట్నంలలో 10.2 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈదురుగాలులకు కొన్ని చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గుంటూరు నగరంలోనూ ఎడతెరిపి లేకుండా చిరుజల్లులు పడుతున్నాయి. వేమూరు, చుండూరు, అమృతలూరు, రెంటచింతల, భట్టిప్రోలు, పెదనందిపాడు, దాచేపల్లి ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. దీంతో జనజీవనానికి ఇబ్బందులు ఏర్పడ్డాయి. తుపాను ప్రభావం మరింత పెరిగే అవకాశముందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇక పొలాల్లో వరిపంట పాడైపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కొద్దిరోజుల్లో పంట కోతలు చేపట్టాల్సిన సమయంలో తుపాను అన్నదాతల్లో గుబులు రేకెత్తిస్తోంది.

ప్రకాశం జిల్లాలో

నివర్ తుపాన్ కారణంగా ప్రకాశం జిల్లాలో ఈదురు గాలులు బలంగా వీస్తున్నాయి. గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో గాలులు వీస్తుండటం వల్ల పలుచోట్ల వృక్షాలు నేలకూలాయి. కుందుకూరు రహదారి, కనపర్తికి వెళ్లే ప్రధాన రహదారిపై భారీ వృక్షం కూలింది. రహదారిపై రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. పోలీసులు చెట్లను తొలగించి వాహన రాకపోకలను క్రమబద్ధీకరించారు. రాచర్ల మండలం ఆకివీడులో నివాసాలు మధ్య ఉన్న బీఎస్​ఎన్​ఎల్ సెల్ టవర్ కూలింది. ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవటం వల్ల ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. జిల్లాలో ఇవాళ, రేపు పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

తూర్పుగోదావరి జిల్లాలో

తుపాను ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో గత రాత్రి నుంచి కుండపోత వర్షం పడుతోంది. వరి చేలు ముంపు బారిన పడ్డాయి. కోతలు పూర్తై పొలంలో వేసిన ధాన్యపు రాశులు తడిసి ముద్దయ్యాయి. పొలంలోని నీటిని బయటకు పంపేందుకు రైతులు శ్రమిస్తున్నారు. కోనసీమలో 90 శాతం మంది రైతులు ఖరీఫ్ లో వరి సాగు వేశారు. ప్రస్తుతం 30 శాతం కోతలు పూర్తయ్యాయి. మిగిలినవి ఇంకా కోయలేదు. తుపాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు, ఈదురు గాలులకు పంట పాడైపోతుందేమో అని అన్నదాతలు భయపడుతున్నారు. కేంద్రపాలిత ప్రాంతం యానాంలోనూ ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జనజీవనం స్తంభించింది.

పశ్చిమగోదావరి జిల్లాలో

నివర్ తుపాను ప్రభావంతో జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పాలకొల్లు, భీమవరం, ఉండి, తాడేపల్లిగూడెంలో వర్షానికి వరి పంట నేలకొరిగింది. దెందులూరు, ఏలూరు, తణుకు, ఆచంటలో వరి పంట పూర్తిగా నేలమట్టం అయ్యిందని రైతులు ఆవేదన చెందుతున్నారు.

నెల్లూరు జిల్లాలో అత్యధిక వర్షపాతం

నెల్లూరు జిల్లాలోని వెంకటగిరిలో అత్యధికంగా 30 సెం.మీ. వర్షపాతం నమోదైందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. మరో తొమ్మిదిచోట్ల 20 సెం.మీ. కంటే ఎక్కువ వర్షపాతం, 72 చోట్ల 11.5 నుంచి 20 సెం.మీ. వరకు వర్షపాతం నమోదు అయ్యిందని వెల్లడించింది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 6 నుంచి 11 సెం.మీ. వరకు, ఉభయగోదావరి జిల్లాల్లో 6 నుంచి 11 సెం.మీ. వరకు వర్షం కురిసిందని ప్రకటించింది.

ఇవీ చదవండి :

రాష్ట్రంపై నివర్ ప్రభావం.. తొలగని ముప్పు

బలంగా తుపాను ప్రభావం.. కోస్తా, సీమ జిల్లాల్లో భారీ వర్షాలు

తీరం దాటిన 'నివర్'

నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు

Last Updated : Nov 26, 2020, 5:55 PM IST

ABOUT THE AUTHOR

...view details