తిరుమలలో భీకర గాలులతో కూడిన వర్షం కురిసింది. నివర్ ప్రభావంతో బుధవారం ఉదయం నుంచి ఎడ తెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. నిన్న సాయంత్రం నుంచి భారీగా వీస్తున్న గాలులతో పాపవినాశనం రహదారిపై చెట్లు నేలకొరిగాయి. వేకువ జామున రెండవ కనుమదారిలో హరణి వద్ద కొండ చరియలు విరిగి పడ్డాయి. రహదారిపై పడ్డ బండరాళ్లను జేసీబీల సాయంతో తొలగించారు. తిరుమల మొదటి కనుమ రహదారిలో చెట్టు విరిగిపడింది. అధికారులు తిరుమల నుంచి తిరుపతికి వాహనాలను నిలిపివేశారు. రహదారిపై పడిన చెట్టును అటవీ సిబ్బంది తొలగిస్తున్నారు.
ఉదయం 6 గంటలకు 14వ కిలోమీటరు వద్ద భక్తులు ప్రయాణిస్తున్న కారు ముందు భాగంలో బండరాయి పడింది. వాహనం ముందు చక్రాలు దెబ్బతిన్నాయి. ప్రమాదంలో భక్తులు సురక్షితంగా బయట పడ్డారు. వాహనం ముందుబాగం పూర్తిగా ధ్వంసమైంది. తిరుమలలోని బాలాజీ నగర్ కమ్యునిటీ హాలు ప్రహరీ గోడ కూలి.. రెండు ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. భారీ గాలుల కారణంగా బాలాజీ నగర్‌కు రాత్రి నుంచే విద్యుత్ సరఫరా ఆపివేశారు. భారీ గాలులు, వర్షాలకు శ్రీవారి భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.