ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా తిరుపతి వేదికగా జరగనున్న జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు రంగం సిద్ధమైంది. నేటి నుంచి ఈనెల 9 వరకూ 22 రాష్ట్రాల నుంచి వచ్చిన 700 మంది క్రీడాకారులు సత్తా చాటేందుకు ఉత్సాహంగా ఉన్నారు. ఇందిరా మైదానం వేదికగా మహిళలు, పురుషుల జట్లకు వేర్వేరుగా మ్యాచ్‌లు నిర్వహిస్తారు.
డే & నైట్ మ్యాచ్‌లు...
మొత్తం 43 జట్లను 4 గ్రూపులుగా విభజించగా లీగ్, నాకౌట్ పద్ధతిలో 175 మ్యాచ్‌లు జరపనున్నారు. ఉదయం 9 గంటల నుంచి ఒంటి గంటవరకు అనంతరం సాయంత్రం 4 గంటల నుంచి 9 గంటల వరకూ డేనైట్ మ్యాచ్‌లు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. తొలి 3 రోజులు లీగ్ పోటీలు, చివరి 2 రోజులు క్వార్టర్, సెమీ ఫైనల్, ఫైనల్ పోటీలు జరగనున్నాయి.
ప్రత్యేక ఏర్పాట్లు...
పురుషుల విభాగంలో తలపడనున్న జట్ల మధ్య పోటీ తొలుత 20 నిమిషాలు. మధ్యలో 5 నిమిషాల విరామం తర్వాత...మరో 20 నిమిషాల పాటు పోటీ నిర్వహిస్తారు. మహిళా విభాగంలో ముందుగా 15 నిమిషాల ఆట. మధ్యలో 5 నిమిషాల విరామం తర్వాత మరో 15 నిమిషాల పోటీ జరపనున్నారు. అంతర్జాతీయస్థాయిలో అనుభవం ఉన్న 70 మంది రిఫరీలు అందుబాటులో ఉండనున్నారు. ప్రేక్షకుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
అట్టహాసంగా ప్రారంభోత్సవ వేడుకలు...
నగరవాసులను కబడ్డీ పోటీలు అలరిస్తాయని స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. ప్రారంభోత్సవ వేడుకల్లో మైదానం రంగురంగుల బాణసంచాల పేలుళ్లు మెరిశాయి. ఈత చెట్టు, నాగుపాము, సూర్య చక్రం, రన్నింగ్ వీల్... ప్రేక్షకులను కనువిందు చేశాయి. బాణసంచా పేలుళ్లకు ముందు సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు అబ్బురపరిచాయి.
ఇవీచదవండి.