తిరుపతి నగరంలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదరర్శి నారా లోకేశ్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయ కూడలిలో నిర్వహించిన బహిరంగ సభలో వైకాపా పాలనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కుడిచేతితో రూ.పది ఇచ్చి ఎడమచేతితో రూ.వంద లాక్కుంటున్నారని విమర్శించారు. జగన్ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి కుంటపడిందన్నారు. నేను ఐటీ మంత్రిగా 35 వేల ఉద్యోగాలు తెచ్చా.. మీరు రెండేళ్లలో ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా అని నిలదీశారు. తెదేపా పాలనలో తిరుపతికి ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చామని.. జగన్ హయాంలో కనీసం పైవంతెనల నిర్మాణాలు కూడా ముందుకెళ్లడంలేదన్నారు.
ముందుగా నగరంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారం ప్రారంభించారు. కృష్ణాపురం ఠానా నుంచి చిన్న బజార్ వీధి మీదుగా తిలక్ రోడ్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గడిచిన రెండున్నర సంవత్సరాల వైకాపా పాలనలో రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న దుర్భర పరిస్థితులను ప్రజలకు వివరించారు. వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉత్తరాదికి చెందిన మార్వాడి వ్యాపారులతో మచ్చటించిన లోకేశ్.. వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ప్రచారంలో పాల్గొంటున్న యువత.. లోకేశ్‌తో స్వీయ చిత్రాలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. యువతను చిరునవ్వుతో పలకరిస్తూ.. సెల్ఫీలు ఇచ్చారు.