CM Jagan Birthday Celebrations in Puttur: చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో సీఎం జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పుత్తూరులో ఎమ్మెల్యే రోజా ప్రత్యర్థి వర్గాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ నుంచి అంబేడ్కర్ కూడలి వరకు ర్యాలీ కొనసాగించారు. భారీ బహిరంగ సభలో భారీ కేక్ కట్ చేశారు.
Chakrapani Reddy On mla roja: ఈ సందర్భంగా శ్రీశైలం దేవస్థాన ఆలయ ఛైర్మన్ చక్రపాణి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే రోజా తీరుపై విమర్శలు గుప్పించారు. నగరి నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేసి.. రోజాను రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించామని గుర్తు చేశారు. అలాంటి తమపై ఇవాళ తిరుగుబాటు చేయటం దారుణమన్నారు. సీఎం పుట్టినరోజు సందర్భంగా లక్షల రూపాయలు ఖర్చు చేసి.. ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే.. వేడుకల ముందురోజు వాటిని ధ్వంసం చేయించడం బాధాకరమన్నారు. ఈ సంఘటనపై పూర్తి సాక్ష్యాధారాలతో సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఈడిగ కార్పొరేషన్ ఛైర్పర్సన్ కే.జే.శాంతిచో పాటు పలువురు జెడ్పీటీసీలతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఐదు మండలాలకు చెందిన కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.
ఫ్లెక్సీల వివాదం.. ఎమ్మెల్యే రోజాపై విమర్శలు!
Flex war in puttur: డిసెంబరు 21న సీఎం జగన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పుత్తూరులో ఆదివారం రాత్రి అసమ్మతివర్గం నాయకులు స్థానిక కార్వేటినగరం రోడ్డు కూడలి నుంచి ఆర్డీఎం థియేటర్ వరకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వాటిని ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. ఈ విషయమై మాజీ ఎంపీపీ ఏలుమలై(అమ్ములు) తన అనుచరులైన రవిశేఖర్‌రాజు, శ్రీధర్‌రాజు, మాడా శ్రీనివాసులు, మాజీ కౌన్సిలర్ మురుగేషన్ తదితరులతో కలిసి సోమవారం కార్వేటినగరం రోడ్డు కూడలిలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏలుమలై మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే రోజా అరాచకం చేస్తోందని, వైకాపాలో ఉండాలంటే అవమానంగా ఉందన్నారు. వైకాపాలోకి తెదేపా నాయకులను తీసుకొచ్చి తాము ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించివేయించారని ఆరోపించారు. గతంలో పుత్తూరులో ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ జరగలేదన్నారు. తెదేపాలో ఆమెను రెండు సార్లు ఓడిస్తే తాము నగరి నుంచి తామంతా కష్టపడి వైకాపాలో రెండుస్లారు గెలిపించామన్నారు. అయినా ఆమెకు కృతజ్ఞతలేదన్నారు. ఫ్లెక్సీల్లో ముఖ్యమంత్రి, డిప్యూటీసీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫొటోలు ఉన్నాయని, వాటిని చించడానికి ఎంత ధైర్యమన్నారు. ధర్నా విషయం తెలిసిన సీఐ వెంకటరామిరెడ్డి తమ సిబ్బందితో అక్కడకు చేరుకుని ఫ్లెక్సీలు చించిన వారిపై పిర్యాధు చేస్తే కేసు నమోదు చేసి వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే తమకు న్యాయం జరిగే వరకు ధర్నాను విరమించమని తేల్చిచెప్పారు. దీంతో ఆయన వారిని అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఫ్లెక్సీలు గుర్తు తెలియని వ్యక్తులు చించారని, వారిపై చర్యలు తీసుకోవాలని అసమ్మతి వర్గం నాయకులు పిర్యాధు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.