చిత్తూరు జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సజావుగా ముగిసింది. రెండు నగరపాలక, నాలుగు పురపాలక సంఘాలకు జరిగిన ఎన్నికల్లో వచ్చిన ఓట్ల లెక్కింపు ఇవాళ జరగగా...అన్ని చోట్లా వైకాపా అభ్యర్థులే ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. ప్రత్యేకించి చిత్తూరు, తిరుపతి నగరపాలక సంస్థలు వైకాపా కైవసమయ్యాయి. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో 50 డివిజన్లు ఉండగా.. ముందే 22 డివిజన్లు వైకాపాకు ఏకగ్రీవం అయ్యాయి. ఎస్ఈసీ ఆదేశాలతో ఏడో డివిజన్లో ఎన్నికలు నిలిచిపోగా.. మిగిలిన 27 డివిజన్లలో జరిగిన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ నేడు నిర్వహించారు. అన్ని డివిజన్లలోనూ సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించిన వైకాపా 27లో 26 డివిజన్లను కైవసం చేసుకోగా.. నగరంలోని 35వ వార్డులో తెదేపా అభ్యర్థి గెలవటంతో ఒకే ఒక్క సీటు ఆపార్టీకి దక్కినట్లైంది.
19 ఏళ్ల తరువాత ఎన్నికలు.. మేయర్ పీఠంపై వైకాపా
చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో 50 డివిజన్లు ఉండగా.. 37 డివిజన్ లు ఇప్పటికే వైకాపాకు ఏకగ్రీవమయ్యాయి. కేవలం 13డివిజన్లకు ఓటింగ్ జరగగా నేడు కౌంటింగ్ ప్రక్రియ పూర్తైంది. 13 డివిజన్లలో 9 చోట్ల వైకాపా అభ్యర్థులు గెలుపొందగా.. 3 చోట్ల తెదేపా, 1 డివిజన్లో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. దీంతో తిరుపతి, చిత్తూరు రెండు చోట్లా వైకాపా అభ్యర్థులే మేయర్ పీఠాన్ని అధిరోహించనున్నారు. దాదాపు 19ఏళ్ల తర్వాత తిరుపతి నగరపాలక సంస్థకు ఎన్నికలు జరగగా..వైకాపా నగరపాలక సంస్థను కైవసం చేసుకుంది.
20 వార్డులకు మదనపల్లె పురపాలక సంఘంలో ఎన్నికలు జరగగా.. 18 చోట్ల వైకాపా, 2 చోట్ల తెదేపా అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. ఇప్పటికే 15 స్థానాలను వైకాపా ఏకగ్రీవం చేసుకోగా.. మొత్తంగా 35 వార్డుల్లో.. 33 వార్డులను గెలుచుకుని వైకాపా పురపాలక సంఘాన్ని కైవసం చేసుకుంది. పలమనేరులో 8వార్డుల్లోనే ఎన్నికలు జరగగా... ఆరు వార్డుల్లో వైకాపా, రెండు వార్డుల్లో తెదేపా విజయాన్ని నమోదు చేశాయి. ఇప్పటికే 18 స్థానాలను వైకాపా ఏకగ్రీవం చేసుకోగా.. మొత్తం 26 వార్డుల్లో 24 వార్డులు గెలుచుకుని పలమనేరు మున్సిపాలిటీని వైకాపా గెలుచుకుంది. నగరి, పుత్తూరు పురపాలక సంస్థలకు సంబంధించి ఫలితాల ప్రకటనకు రెండు రౌండ్లు నిర్వహించగా...రెండు మున్సిపాలిటీల్లోనూ వైకాపా జెండానే రెపరెపలాడింది. నగరి మొత్తం 29 వార్డులుండగా.. ఇప్పటికే 7వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 22 వార్డుల్లో జరిగిన ఎన్నికల్లో 18 చోట్ల వైకాపా అభ్యర్థులు, మూడు చోట్ల తెదేపా, ఇతరులు ఒక స్థానాన్ని కైవసం చేసుకున్నారు. పుత్తూరుకు సంబంధించి 27 వార్డులు ఉండగా.. అందులో ఒక వార్డు వైకాపాకు ఏకగ్రీవమైంది. 26 వార్డుల్లో ఎన్నికలు జరగగా.. వైకాపా 21 వార్డులు, తెదేపా 5 వార్డుల్లో గెలుపొందింది. దీంతో 22 వార్డులతో పుత్తూరు పురపాలక సంఘాన్ని అధికార పార్టీ కైవసం చేసుకుంది.
కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. చిత్తూరు, అర్బన్ పోలీసులు సంయుక్తంగా బందోబస్తు నిర్వహించారు. యాక్ట్ 30 ని అమలులో ఉంచటంతో పాటు.. 144 సెక్షన్ విధించారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎంపిక సంబంధించి ఈ నెల 18న ఓ స్పష్టత రానుంది.
ఇదీ చదవండి
కడప కార్పొరేషన్ వైకాపా సొంతం