రాష్ట్రంలో ఎడాపెడా పెంచుతున్న పన్నులను చూసి ఔరంజేబు పాలన గుర్తుకొస్తోందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. సంక్షేమ కార్యక్రమాల పేరిట పేదలకు ఈ చేత్తో ఇచ్చింది పన్నుల పేర ఆ చేత్తో లాగేసుకోవడం ఏం న్యాయమని ప్రశ్నించారు. రోజుకో లేఖలో భాగంగా ముఖ్యమంత్రి జగన్‌కు శుక్రవారం 6వ లేఖ సంధించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఆస్తిపన్ను, చెత్త పన్నుల విధానం గురించి ఇందులో ప్రస్తావించారు. ‘జగనన్న సంక్షేమ కార్యక్రమాల ద్వారా పేదలకు నెలకు రూ.800-1,200 దాకా ప్రయోజనం కల్పిస్తే పెరిగిన ధరలు, పన్నుల వల్ల రూ.10 వేలు ఖర్చుచేయాల్సి వస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ధరలు ఒకటి, రెండు రూపాయలు పెరిగితేనే ప్రతిపక్ష నాయకుడి హోదాలో గందరగోళం సృష్టించిన మీ నుంచి ప్రజలు ఉపశమనాన్ని కోరుకుంటున్నారు. పేదలకు సంక్షేమ పథకాల పేరిట వేల రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం.. వారు నివసిస్తున్న 375 చదరపు అడుగుల ఇంటికి రూ.50 పన్ను ఎందుకు విధిస్తోందో అర్థం కావట్లేదు. ఇది ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో తీసుకోవడమే.
జులై 8న రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా ప్రారంభించిన క్లీన్ ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రాం (క్లాప్) ద్వారా చెత్త సేకరణకు ప్రతి ఇంటి నుంచి రూ.30 వసూలుచేయాలని ఆశిస్తున్నారు. దీనికి క్లాప్ అని పేరు పెట్టినా దానికి ప్రజల నుంచి క్లాప్స్ వచ్చే పరిస్థితి లేదు. గత ప్రభుత్వం 60 నెలల్లో రూ. 1.30 లక్షల కోట్ల అప్పులు చేస్తే మన ప్రభుత్వం గత 24 నెలల్లో విచక్షణారహితంగా రూ.1.55 లక్షల కోట్ల అప్పులు చేసింది. ప్రభుత్వ ప్రతిభ ద్వారా ఆర్థికలోటు భర్తీ అవుతున్నప్పుడు, పన్నులు ఎందుకు పెంచాల్సి వచ్చింది? ఒకవైపు పెరుగుతున్న నిత్యావసర ధరలు, మరోవైపు పన్నులను చూస్తే జిజ్యాపన్ను విధించిన ఔరంగజేబు పాలనకేమీ మీది తక్కువ కాదనిపిస్తోంది. చెత్తపన్ను వేసే అధికారం రాష్ట్రాలకు ఉన్నట్లు రాజ్యాంగ నిబంధనల్లో ఎక్కడా లేదు. పంట వచ్చినప్పుడు అయిదో వంతు రాజుకివ్వు, మరో అయిదింట నాలుగో భాగం విత్తనాలు, నీకు నీ కుటుంబానికి, చివరికి నీ పిల్లల ఆహారం కోసం నీ దగ్గరే ఉంచుకో అని బైబిల్ న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్ (చాప్టర్ 47, వెర్స్ 24) చెబుతోంది. కానీ ఈ ప్రభుత్వంలో విధించిన పన్నులను చూస్తే పేద కుటుంబాలు మనుగడ సాగించడానికి ఏమీ మిగిలేలా లేదు. ఇప్పటికైనా దయచూపి ప్రజలను పన్ను పెంపు నుంచి మినహాయించండి’ అని రఘురామకృష్ణరాజు ముఖ్యమంత్రికి సూచించారు.