మదనపల్లెలో దారుణం..ఇద్దరు కుమార్తెలను చంపిన తల్లి - చిత్తూరులో ఇద్దరు కుమార్తెలను చంపిన తల్లి
21:21 January 24
మదనపల్లెలో దారుణం..ఇద్దరు కుమార్తెలను చంపిన తల్లి
చిత్తూరు జిల్లా మదనపల్లెలో దారుణం చోటుచేసుకుంది. నవమాసాలు మోసి కనిపెంచిన తల్లి తన ఇద్దరు కుమార్తెలను డంబెల్‌తో మోది దారుణహత్య చేసింది. అయితే పూజల పేరుతో తల్లిదండ్రులే హత్యచేసినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మదనపల్లె స్థానిక శివనగర్‌లో పురుషోత్తమ్ నాయుడు, పద్మజ దంపతులు గత కొంతకాలంగా నివాసముంటున్నారు. పురుషోత్తమనాయుడు మహిళా డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్‌గా, ఆయన భార్య పద్మజ ఓ ప్రైవేట్ విద్యాసంస్థ కరస్పాండెంట్, ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నారు. వీరికి అలేఖ్య(27), సాయిదివ్య(22) కుమార్తెలున్నారు. వీరు గత కొంతకాలంగా ఇంట్లో అద్భుతాలు జరుగుతాయని పూజలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆదివారం కూడా ఇంట్లో పూజలు నిర్వహించి మొదట సాయి దివ్యను, తర్వాత అలేఖ్యను వ్యాయామం చేసే డంబెల్‌తో కొట్టి హత్యచేశారు. ఇంట్లో నుంచి పెద్దగా శబ్దాలు రావడంతో స్థానికులు గుర్తించి కళాశాల సిబ్బందికి, పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో డీఎస్పీ రవి మనోహరాచారి తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ.. పురుషోత్తమనాయుడు, పద్మజ, వారి ఇద్దరు కుమార్తెలు కూడా దైవభక్తితో పూజలు చేస్తున్నట్లుగా ప్రాథమికంగా గుర్తించామని, ఈ నేపథ్యంలో తన ఇద్దరు కుమార్తెలను హత్యచేసినట్లు ప్రాథమికంగా తెలిసిందని ఆయన తెలిపారు. క్లూస్‌టీం వచ్చిన తర్వాత పూర్తిస్థాయి సమాచారం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి:వ్యాక్సినేషన్‌తో ఎలాంటి సమస్యలు లేవు: ఆరోగ్యశాఖ డైరెక్టర్