ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మది నిండా అమ్మ జ్ఞాపకాలే.. అనాథ శవంగా అంత్యక్రియలు జరిగాయనుకున్నాడు కానీ..! - mother died with corona at tirupathi news

ఆ అమ్మను అనాథ శవంగా గుర్తించి అంత్యక్రియలు చేసేశామని సిబ్బంది చేతులెత్తేశారు. చివరిసారి తల్లిని చూడలేకపోయానన్న ఆవేదన పేగు బంధాన్ని వెంటాడుతూనే ఉంది. తల్లి ఇక కనిపించదని తెలిసినప్పటికీ అంత్యక్రియలు నిర్వహించామన్న చోటుకు కుమారుడు వెళ్లారు. మనసు నిండా అమ్మ జ్ఞాపకాలతో శ్రద్ధాంజలి ఘటిస్తుండగా ప్రేమమూర్తి అనాథ శవంగా కనిపించింది. ఆ సమయంలో కుమారుడి గుండె తడి ప్రతి ఒక్కరిని విచలితులను చేసింది. ఈ విషాదం తిరుపతిలో చోటుచేసుకుంది.

mother died with corona in tirupathi
mother died with corona in tirupathi

By

Published : May 31, 2021, 8:18 AM IST

తిరుపతి నగరంలోని కొర్లగుంటలో నివసించే లక్ష్మీదేవి(62)కి కుమారుడు సురేంద్ర, కోడలు ఉన్నారు. వారు ముగ్గురూ ఒకేసారి కరోనా బారినపడ్డారు. మందులు వేసుకుంటూ ఇంట్లోనే కాలం వెళ్లదీసిన కారణంగా.. వారికి వ్యాధి తీవ్రత పెరిగింది. ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారడంతో ఈనెల 14న ముగ్గురూ రుయా ఆసుపత్రికి వెళ్లారు. లక్ష్మీదేవికి పాత ప్రసూతి ఆసుపత్రిలో పడక లభించింది. దంపతులు ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. రెండు రోజులకు రూ.1.60 లక్షల బిల్లు కావడంతో భరించలేక దంపతులు పూర్తిగా కోలుకోకుండానే ఇంటికి వచ్చేశారు. తల్లి వద్ద ఫోన్ లేకపోవడంతో ఆమె ఆరోగ్యంపై ఆందోళనతోనే కుమారుడు కదల్లేని స్థితిలో భారంగా గడిపారు.

తెలిసిన వారి ద్వారా ఆరా తీసినప్పటికీ నిష్ఫలమే అయింది. సురేంద్ర ఆరోగ్యం కుదుటపడ్డాక ఈనెల 29న ఆసుపత్రి వద్దకెళ్లగా అమ్మ గురించి తొలుత ఎవరూ వివరాలు తెలపలేదు. వార్డు వాలంటీరు రూప, సెక్టోరల్‌ అధికారి సుధాకర్‌ స్పందించారు. వారి విచారణలో ఈనెల 19న లక్ష్మీదేవి చనిపోయారని, అనాథ శవంగా భావించి అంత్యక్రియలు పూర్తి చేసి ఉంటారనే సమాధానం వచ్చింది. చేసేది లేక అనాథ శవాలను దహనం చేసిన మామండూరు అటవీ ప్రాంతానికి తన భార్యతో కలిసి తల్లికి శ్రద్ధాంజలి ఘటించేందుకు ఆదివారం వెళ్లారు. అదే సమయంలో 16 అనాథ శవాల అంత్యక్రియల కోసం ఈ ప్రాంతానికి చెందిన ముస్లిం ఐకాస సభ్యులు బయలుదేరారు.

ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి వారి వెంట ఉన్నారు. చివరి ఆశగా ఓసారి శవాలను పరిశీలించాలని సురేంద్రను సెక్టోరల్‌ అధికారి పిలిపించారు. మృతదేహాల్లో తన తల్లి శవాన్ని గుర్తించి సురేంద్ర బోరున విలపించారు. ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి, ముస్లిం ఐకాస సభ్యులు ఓదార్చి ఆయన సమక్షంలోనే అంత్యక్రియలు నిర్వహించారు.

ఇదీ చదవండి:

రాజ్​నాథ్​ను కలిసిన ఎంపీ రఘురామ.. కేపీరెడ్డిపై విచారణ చేయించాలని విజ్ఞప్తి

ABOUT THE AUTHOR

...view details