Minister Peddireddy on illegal mining : రాష్ట్రంలో గనుల అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్లు నిరూపిస్తే.. బాధ్యత వహిస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు తమపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. రుషికొండలో అక్రమాలు జరగడం లేదని.. అనుమతులు ఉన్న ప్రాంతంలోనే తవ్వకాలు జరుగుతున్నాయని చెప్పారు. గనుల తవ్వకాల ద్వారా ప్రభుత్వానికి 6 కోట్ల రూపాయల రాయల్టీ వచ్చిందన్నారు.
కుప్పంలో చంద్రబాబు బినామీలే అక్రమంగా తవ్వకాలు చేస్తున్నారని పెద్దిరెడ్డి ఆరోపించారు. కుప్పం నియోజకవర్గ పరిధిలో 31 గనులకు సంబంధించి తవ్వకాలు చేస్తున్నారని.. మరో 71 గనులకు వర్కింగ్ లీజులు ఉన్నాయని తెలిపారు. లీజులు అన్ని తెదేపా, కాంగ్రెస్ పాలనలో ఇచ్చారని.. వైకాపా అధికారంలోకి వచ్చాక ఎలాంటి లీజులు ఇవ్వలేదన్నారు. సీఎం జగన్పై బురద చల్లడానికి చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.