Meters to Agriculture Motors: వ్యవసాయ విద్యుత్తు మోటార్లకు మీటర్లు పెట్టే కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించి దశలవారీగా పూర్తి చేస్తామని ఏపీఎస్‌పీడీసీఎల్ సీఎండీ హెచ్.హరనాథరావు వెల్లడించారు. చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలంలోని హార్సిలీహిల్స్‌లో మంగళవారం రాయలసీమ, నెల్లూరు జిల్లా విద్యుత్తుశాఖ ఉన్నతాధికారుల సమావేశం నిర్వహించారు. విద్యుత్తు మీటర్ల నాణ్యత, భద్రతపై సమగ్ర పరిశీలన జరుపుతున్నామని, ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే అమలు చేస్తామని హరనాథరావు తెలిపారు.
ఐదు జిల్లాల్లో ఈ ఆర్థిక సంవత్సరంలో 45వేల వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు ఇచ్చామని, వచ్చే ఏడాది మరో 75వేల కనెక్షన్లను ఇచ్చేందుకు ప్రభుత్వ అనుమతిని కోరినట్లు ఆయన వెల్లడించారు. రానున్న వేసవిలో 10 శాతం విద్యుత్తు వినియోగం పెరుగుతుందని అంచనా వేసి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నామన్నారు. రైతులకు తొమ్మిది గంటల నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తామని చెప్పారు.