meeting to support of decentralization: అధికార వికేంద్రీకరణకు మద్దతుగా రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని రాయలసీమ అభివృద్ధి సంఘాల సమన్వయ వేదిక నేతలు వెల్లడించారు. జనవరిలో శ్రీశైలం నుంచి అమరావతి వరకు చైతన్యయాత్ర, విశ్వవిద్యాలయాల్లో సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. శనివారం తిరుపతిలో రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్ పురుషోత్తంరెడ్డి అధ్యక్షతన బహిరంగ సభ జరిగింది. సీఎం జగన్ చెప్పిన సమగ్రాభివృద్ధి బిల్లుకు తాము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని నేతలు స్పష్టం చేశారు. స్వార్థ ప్రయోజనాల కోసం తెదేపా అమరావతి నినాదం ఎత్తుకుందని రాయలసీమ అధ్యయన సంస్థ అధ్యక్షుడు భూమన్ సుబ్రహ్మణ్యం విమర్శించారు. మూడు రాజధానులకు మద్దతుగా తిరుపతిలో రిలే దీక్షలు చేెస్తామన్నారు. రాయలసీమ కార్మిక, కర్షక సమితి అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ అమరావతికి మద్దతుగా సీఎం జగన్ ప్రతిపక్ష నాయకుడి హోదాలో మాట్లాడిన విషయం వాస్తవమేనని, అనంతరం వాస్తవాలను గ్రహించి మూడు రాజధానుల ప్రకటన చేశారని వివరించారు. కుందూ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ అమరావతి రైతులది భూములు పోగొట్టుకున్న బాధ తప్పితే, రాష్ట్రం గురించి కాదన్నారు. న్యాయవాది శివారెడ్డి మాట్లాడుతూ అమరావతిలోని హైకోర్టులో తాగడానికి నీరు కూడా లేవని, అసౌకర్యాల నడుమ ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. రచయిత బండి నారాయణస్వామి మాట్లాడుతూ.. రాజధానికి భూములు ఇవ్వక ముందు అక్కడి భూములు రూ.లక్షల విలువ చేసేవని, ఇచ్చిన తర్వాత రూ.కోట్ల ధర పలికాయని తెలిపారు. ఇప్పుడు ఆ భూములను కాపాడుకోడానికే పాదయాత్రలు చేస్తున్నారని విమర్శించారు. భూములకు నష్టపరిహారం కావాలని ఉద్యమాలు చేయాలే తప్ప రాజధాని కోసం కాదని ఉత్తరాంధ్ర పోరాటసమితి అధ్యక్షుడు రాజాగౌడ హితవు పలికారు. తామంతా అమరావతికి వ్యతిరేకం కాదని, ఏకైక రాజధానిగా అమరావతిని చేయడానికే వ్యతిరేకమన్నారు. రాయలసీమ మహాసభ అధ్యక్షుడు శాంతి నారాయణ మాట్లాడుతూ.. 29 గ్రామాల రైతులు, మహిళలు చేసిన పాదయాత్ర 4.5 కోట్ల మందికి అవమానంగానే భావిస్తున్నామని చెప్పారు. పరిపాలన రాజధాని గానీ, శాసన రాజధాని గానీ రాయలసీమకు కావాలని ఉద్యమనేత రాజారెడ్డి డిమాండ్ చేశారు.
డ్వాక్రా సంఘాల సభంటే వచ్చాం
సభకు వచ్చిన మహిళల్లో కొందరు గందరగోళానికి లోనయ్యారు. తామెందుకు వచ్చామో తెలియక ఆందోళనలో పడ్డారు. హాజరు నమోదవ్వగానే వెళ్లిపోవడానికి ప్రయత్నించారు. మరికొందరు డ్వాక్రా మీటింగ్ అంటే వచ్చామని, ఇక్కడ మరో కార్యక్రమం జరుగుతోందన్నారు. సభకొచ్చిన విద్యార్థులు ఆడుకుంటూ కనిపించారు.
మెప్మా... ఇదేంటమ్మా?
మెప్మా ఉద్యోగుల బలవంతపు జన సమీకరణపై విమర్శలు వెల్లువెత్తాయి. కఠిన హెచ్చరికలు, ఒత్తిళ్లు తేవడం... హాజరు నమోదుచేయడం వంటి చర్యలు చర్చనీయాంశమయ్యాయి. శనివారం తిరుపతిలో అభివృద్ధి వికేంద్రీకరణపై నిర్వహించిన సభకు మహిళలే 80% వరకు రాగా, మిగిలిన వారు కళాశాల విద్యార్థులు. మెప్మా ఉద్యోగులు మహిళా సభ్యులను సభకు తీసుకువచ్చారు. సభ వద్ద ఆర్పీలు బహిరంగంగా సభ్యుల హాజరు నమోదు చేయడం కనిపించింది. హాజరు అనంతరం సభ ప్రారంభం కాకముందే మహిళలు తిరుగు ప్రయాణానికి ప్రయత్నించారు. ఈ సమయంలో రెండు గేట్లు మూసివేసి బయటకు వెళ్లకుండా నాయకులు, మెప్మా ఉద్యోగులు, పోలీసులు వారిని అడ్డుకున్నారు. కొందరు వీరితో గొడవపడి గేట్లు తీయించుకుని బయటకు వెళ్లారు. మరికొందరు గేట్లు దూకి బయటకు వెళ్లారు. వీరిని అనుసరించడానికి ప్రయత్నించిన ఇతర మహిళలను మెప్మా ఉద్యోగులు కూర్చోవాలని హెచ్చరించడం, పోలీసులు అడ్డుగా నిలబడటం లాంటి పరిణామాలు కనిపించాయి. వేదికపై ఉన్నవారిలో సగం మంది ప్రసంగాలు పూర్తికాక ముందే సభలోని జనం సగానికి పైగా వెళ్లిపోయారు. పోలీసులు పెద్ద ఎత్తున తరలివచ్చి సభ నిర్వహణకు సహకరించారు.