తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకొనేందుకు వచ్చే భక్తులకు.. విజ్ఞానాన్ని, వినోదాన్ని పంచుతున్న తిరుపతి శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాల తొమ్మిది నెలల తర్వాత తిరిగి ప్రారంభమైంది. కరోనా తర్వాత ప్రారంభమైన జంతుప్రదర్శనశాల సందర్శకులను అలరిస్తోంది. కరోనాతో నెలల తరబడి ఇంటికే పరిమితమైన ప్రజలు కొంతవరకు సాధారణ పరిస్థితి నెలకొనడంతో బయటకు వస్తున్నారు. పక్షులు, జంతువులు, సరీసృపాలు ఇలా దాదాపు పదకొండు వందల వరకు విభిన్న జీవ జాతులను చూస్తూ సేదతీరుతున్నారు.
సహజ సిద్ధమైన, విశాలమైన అడవి అందాల మధ్య సంచరిస్తున్న జంతువులను తిలకిస్తూ పర్యాటకులు మధురానుభూతులకు లోనవుతున్నారు. మూడు వేల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్న దాదాపు 30 రకాల పక్షి జాతులతో పాటు వివిధ జంతువులను వీక్షిస్తూ పర్యాటకులు ఆనందిస్తున్నారు. కరోనాకు ముందు రోజుకు మూడు వేల మందికి పైగా పర్యాటకులు వచ్చేవారు. ఇప్పుడు సుమారు రెండు వేల సందర్శకులు ప్రదర్శనశాలకు వస్తున్నారని అధికారులు తెలిపారు.
"కరోనా కారణంగా సందర్శకులను పరిమితం చేశాం. కొవిడ్ నిబంధనలు అనుసరిస్తూ వాహనాల్లో తొమ్మిది నుంచి పదిమంది వరకే అనుమతిస్తున్నాం. జంతుప్రదర్శనశాలలోకి వచ్చే వాహనాలను శానిటైజ్ చేయిస్తున్నాం. ఈ నెల మొదటి నుంచి లయన్ సఫారీ ప్రారంభం కావటంతో సందర్శకులు కూడా పెరిగారు" - హిమశైలజ, తిరుపతి జూ క్యూరేటర్