ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎర్రంరెడ్డిపాలెంలో నిబంధనలు ఉల్లంఘించి... రిజిస్ట్రేషన్లు! - తిరుపతి వార్తలు

చిత్తూరు జిల్లాలో భూ మాయలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా చూపిస్తున్నారు రిజిస్ట్రేషన్‌, రెవెన్యూ శాఖలోని కొందరు అధికారులు. సుమారు రూ.15 కోట్ల విలువైన భూమికి సంబంధించి నిబంధనలు పాటించకుండా రిజిస్ట్రేషన్లు చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. భూమి నోషనల్‌ ఖాతాలో ఉన్నా రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ అక్రమం రేణిగుంట మండలం ఎర్రంరెడ్డిపాలెంలో వెలుగు చూసింది.

Land registrations without following the rules of Erramreddypalem
ఎర్రంరెడ్డిపాలెంలో భూ మాయ

By

Published : Oct 6, 2020, 2:39 PM IST

చిత్తూరు జిల్లా ఎర్రంరెడ్డిపాలెంలోని సర్వే నెంబరు 517లో ఫీల్డ్‌ మెజర్‌మెంట్‌ బుక్‌(ఎఫ్‌ఎంబీ) ప్రకారం మొత్తం 4.27 ఎకరాలు ఉంది. క్షేత్ర స్థాయిలో ఒక సర్వే నంబరులో ఎన్ని ఎకరాలు ఉంది అనేది ఎఫ్‌ఎంబీ ద్వారానే తెలుస్తుంది. సర్వే నంబరు 517లో మొత్తం 4.27 ఎకరాలు ఉంది. ఆ తర్వాత 517/1 అనే మరో సర్వే నంబరును తీసుకొచ్చారు. ఇందులో ఒకరి పేరుతో 3.27 ఎకరాలు ఉన్నట్లుగా ఆన్‌లైన్‌లో పొందుపర్చారు. ఒకసారి సర్వే నంబరును సబ్‌డివిజన్‌ చేసిన తర్వాత వాస్తవ సర్వే నంబరును తొలగించి /1, /2 కింద మార్పు చేస్తారు. ఇక్కడ అలా చేయకపోగా రెండు సర్వే నెంబర్లు ఉంచారు. ఈ రెండింటిని కలిపితే మొత్తం 7.54 ఎకరాలుగా ఉంటుంది. అంటే కొత్తగా 3.27 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చిందో అధికారులకే తెలియాలి.

మరోమారు డిజిటల్‌ సంతకం

ఎర్రంరెడ్డిపాలెం.. అన్‌సెటిల్డ్‌ గ్రామం కింద ఉంది. వాస్తవానికి 1975 ప్రాంతంలో ఇక్కడ సర్వే నిర్వహించి తొలుత సుమారు 114 ఎకరాల భూమి ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత మరోమారు 1985లో సర్వే నిర్వహించి 350 ఎకరాలు ఉన్నట్లుగా గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. రెండు సర్వేల్లో తేడా ఉండటంతో కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మరోవైపు సర్వే నెంబరు 517/1 డిజిటల్‌ సంతకంపై కూడా వివాదం ఉంది. వాస్తవానికి గతంలో ఈ సర్వే నెంబరుపై ఉన్న డిజిటల్‌ సంతకాన్ని అధికారులు తొలగించారు. ఆ తర్వాత మళ్లీ దీన్ని తీసుకొచ్చారు. ఒక్కసారి డిజిటల్‌ సంతకం తొలగించిన తర్వాత తిరిగి దాన్ని ఆమోదించే అధికారం కేవలం ఆర్డీవోకే ఉంటుంది.

నోషనల్‌ ఖాతాలో ఉన్నా..

సర్వే నెంబరు 517/1 కొన్నేళ్లుగా నోషనల్‌ ఖాతా కిందనే కొనసాగుతోందని రెవెన్యూ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇలా ఉన్న భూమిని రిజిస్ట్రేషన్‌ ఎలా చేశారనేది ప్రశ్నార్థకంగా మారింది. రెవెన్యూ రికార్డుల్లో నోషనల్‌ ఖాతా కింద ఉన్న భూములను రిజిస్ట్రేషన్‌ చేయవద్దని గతంలోనే రిజిస్ట్రేషన్‌శాఖ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి అధికారులకు స్పష్టం చేశారు. వీటి రిజిస్ట్రేషన్లకు సంబంధించి 2016 ఆగస్టు 12వ తేదీన అధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రేణిగుంట సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో దీన్ని ఉల్లంఘించినట్లుగా విమర్శలు వినిపిస్తున్నాయి. నోషనల్‌ ఖాతాలో ఉన్నా ఆగస్టులో 3.27 ఎకరాలకు సంబంధించి ఇద్దరి పేరుతో రిజిస్ట్రేషన్లు జరిగాయి.

వారం రోజుల్లో నివేదిక

సర్వే నెంబరు 517/1లో నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు జరిగినట్లు నా దృష్టికి వచ్చింది. వారం రోజుల్లో నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు పంపిస్తాం. నోషనల్‌ ఖాతాలో ఉన్న సర్వే నెంబర్లలో రిజిస్ట్రేషన్లు చేయకూడదని గతంలో ఆదేశాలు ఇచ్చాం. - పుష్పలత, డీఐజీ, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్లశాఖ

ఇదీ చదవండి:

స్వచ్ఛంగా కొన్నారు.. అచ్చంగా వదిలేశారు!

ABOUT THE AUTHOR

...view details